జాతీయ వార్తలు

డేరా చిరిగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచకుల/ సిర్సా, ఆగస్టు 26: బాబా ముసుగులో ఓ దొంగసన్యాసి తాను చేసిన నేరానికి శిక్ష వేసినందుకు 37మంది ప్రాణాలను బలిగొన్నాడు. వందల కోట్ల రూపాయల ఆస్తుల విధ్వంసానికి కూడా కారణమైనాడు. డేరా సచ్చా సౌదా పేరుతో భోగలాలసమైన ఆశ్రమాలను నడుపుతూ విఐపిల దేవుడిగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ భోగాన్ని అనుభవిస్తున్న గుర్మీత్ రామ్హ్రీమ్ సింగ్‌కు అత్యాచారం కేసులో స్థానిక కోర్టు దోషిగా ఖరారు చేసినందుకే అతని అనుచర గణం రెచ్చిపోయి హర్యానా, పంజాబ్‌లలో బీభత్సం సృష్టించింది. పొరుగు రాష్ట్రాలకూ ఈ అల్లర్లు పాకాయి. నిన్న మొన్నటిదాకా అతని అడుగులకు మడుగులొత్తిన రాజకీయ, అధికార గణం అంతా ఈ విధ్వంసకాండను చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. జరగాల్సిన నష్టం అంతా అయ్యాక, హర్యానా హైకోర్టు ప్రధాని మొదలుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని తీవ్రంగా తప్పుపట్టిన తరువాత కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలను వేగం చేయలేదు.ఇదిలా ఉండగా రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
శుక్రవారం కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పంచకులలో పెద్ద ఎత్తున డేరా సచ్చా బాబా అనుచరులు చేరడానికి కారకుడయ్యాడన్న ఆరోపణపై పంచకుల డిఎస్‌పి అశోక్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ రామ్ నివాస్ శనివారం చెప్పారు. డిసిపి జారీ చేసిన నిషేధాజ్ఞల్లో ఆయుధాలు పట్టుకు వెళ్లడాన్ని మాత్రమే నిషేధించారని, అయిదుగురికంటే ఎక్కువ మంది గుమి కూడదని పేర్కొనలేదని ఆయన చెప్పారు.
కాగా, శనివారం సిర్సాలోని డేరా సచ్చా ప్రధాన కార్యాలయం ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆర్మీ, పారా మిలిటరీ బలగాలను మోహరించడంతో పాటు ఆశ్రమంలోకి వెళ్లే అన్ని మార్గాల్లోను బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆశ్రమంలోపల పెద్ద సంఖ్యలో మహిళలు సహా వేలాది మంది డేరా అనుచరులు దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో వారినందరినీ ఇళ్లకు పంపించే యత్నాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటికిప్పుడు డేరాలోకి ప్రవేశించే ఆలోచన లేదని, ప్రస్తుతం శాంతిభద్రతల పరిరక్షణపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టామని 33 ఆర్మ్‌డ్ డివిజన్ జిఓసి మేజర్ జనరల్ రాజ్‌పాల్ పునియా సిర్సాలో చెప్పారు. తక్షణం ఆశ్రమం క్లాంప్లెక్స్‌ను వదిలిపెట్టి వెళ్లాల్సిందిగా సైన్యం లౌడ్ స్పీకర్లలో హెచ్చరికలు కూడా చేసింది. దాదాపు 2 వేల మంది సైనికులు ఆశ్రయం ప్రాంతాల్లో పహరా నిర్వహిస్తున్నారు.
ఎకె-47లు, మారణాయుధాలు స్వాధీనం
ఇదిలా ఉండగా, సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం సమీపంలో తనిఖీలు జరిపిన పోలీసులకు ఒక వాహనంలో రెండు ఎకె-47 రైఫిళ్లు, మరో వాహనంలో పిస్టళ్లు, తుపాకులు దొరికాయి. కాగా, రాష్టవ్య్రాప్తంగా డేరాకు చెందిన 30కి పైగా సమావేశ మందిరాలకు పోలీసులు సీళ్లు వేశారు. అంబాలాలో 13, కురుక్షేత్రలో 10, యమునానగర్ జిల్లాలో 8 కేంద్రాలకు తాళాలు వేసినట్లు రాష్ట్ర అదనపు డిజిపి ఆర్‌మిశ్రా శనివారం సాయంత్రం విలేఖరులకు చెప్పారు. ఒక్క కురుక్షేత్రలోనే 3 వేలకు పైగా లాఠీలు, పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిలు దొరికినట్లు ఆయన చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న 98 కేంద్రాల్లో లాఠీలు, రాడ్‌లు, గొడ్డళ్లు లాంటి మారణాయుధాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. డేరా బాబా అనుచరులపై 2 దేశద్రోహం కేసులను కూడా నమోదు చేసినట్లు డిజిపి బిఎస్ సంధు శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో చెప్పారు.
రాజ్‌నాథ్ సమీక్ష
మరో వైపు దేశంలో ముఖ్యంగా హర్యానాలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి హోం శాఖ ఉన్నతాధికారులు, జాతీయ భధ్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజన్స్ అధికారులు హాజరయ్యారు.రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్తితి అదుపులో ఉన్నట్లు హర్యానా పోలీసులు హోంమంత్రికి హామీ ఇచ్చినట్లు సమావేశం అనంతరం హోం కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి విలేఖరులకు చెప్పారు. శనివారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరగలేదని సిర్సాలో పోలీసు ఉన్నతాధికారి కూడా చెప్పారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం పంచకుల కోర్టుకు వచ్చినప్పుడు బాబా గుర్మీత్ బ్యాగును మోసినందుకు రాష్ట్ర డిప్యూటీ అడ్వకేట్ జనరల్ గురుదాస్ సింగ్‌ను హర్యానా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాబా బ్యాగ్‌ను ఆయన పట్టుకున్న దృశ్యాలు మీడియాలో రావడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకొంది.
జైల్లోనే శిక్ష ప్రకటించనున్న జడ్జి
కాగా, అత్యాచారం కేసులో రామ్ రహీమ్ బాబాకు విధించే శిక్షలను ఖరారు చేయనున్న సిబిఐ జడ్జి ఆ శిక్షలను పంచకుల కోర్టులో కాకుండా రోహ్టక్ జైలులోనే ప్రకటించనున్నారు. శిక్షలను ప్రకటించడం కోసం సిబిఐ జడ్జిని రోహ్టక్ జైలుకు హెలికాప్టర్‌లో తీసుకెళ్లాలని, ప్రత్యేక కోర్టు నిర్వహణకోసం జైలులో ఏర్పాట్లు చేయాలని శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.