జాతీయ వార్తలు

ఆయన దేశానికి ప్రధాని.. బిజెపికి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 26: డేరా సచ్చా సౌదా బాబా గుర్మీత్ రామ్ రహీమ్‌ను అత్యాచారం కేసులో కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత శుక్రవారం పంచకులలో చెలరేగిన హింసాకాండ పట్ల హర్యానా ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి ప్రధాని నరేంద్ర మోదీపై సైతం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి.. బిజెపికి కాదు’ అని వ్యాఖ్యానించింది. శుక్రవారం పంచకులలో జరిగిన హింసాకాండపై దాఖలయిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎస్ సింగ్ శరన్ నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం జరిగిన హింసాకాండ రాష్ట్రానికి సంబంధించిన అంశమని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్ చెప్పగా, కోర్టు తీవ్రంగా స్పందిస్తూ ‘హర్యానా భారత దేశంలో భాగం కాదా? పంజాబ్, హర్యానా రాష్ట్రాలను సవతి బిడ్డలుగా ఎందుకు చూస్తున్నారు?’ అని ప్రశ్నించింది.
అంతకు ముందు పరిస్థితిని అదుపు చేయలేక పోయిన ఖట్టర్ ప్రభుత్వంపైనా న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ‘మీరంతా కలిసి రాజకీయ ప్రయోజనాలకోసం ప్రశాంతంగా ఉండే పంచకులను తగులబెట్టారు? తప్పుడు ఆదేశాలిచ్చిన రాజకీయ నేతలకోసం పంచకుల డిసిపి లాంటి ఓ చిన్న ఉద్యోగిని శిలువ వేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాక సంఘ వ్యతిరేక శక్తులే హింసాకాండకు కారణమని ముఖ్యమంత్రి ఖట్టర్ చేసిన వ్యాఖ్యలను సైతం బెంచ్ తప్పుబట్టింది. ‘సిబిఐ కోర్టు తీర్పు ప్రకటించిన వెంటనే జనంలో అసాంఘిక శక్తులు కలిసి పోయారని మీకు తెలిసిపోయింది. పంచకులకు పెద్ద సంఖ్యలో డేరా బాబా అనుచరులు వచ్చినప్పుడు మీకు ఈ విషయం ఎందుకు తెలియలేదు?’ అని కూడా ప్రశ్నించింది. ఆందోళనకారులకు మీరు లొంగపోయారు. పరిస్థితిని తీవ్రతరం చేయడానికి మీరు అనుమతిస్తున్నారు అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. డేరా ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని ఆదేశించిన బెంచ్, దానికి ఉన్న స్థిర, చరాస్తుల జాబితాను తయారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా శుక్రవారం జరిగిన విధ్వంసకాండలో నష్టపోయినవారికి పరిహారం చెల్లించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, సిర్సానుంచి పంచకుల కోర్టుకు వచ్చేటప్పుడు బాబా కాన్వాయ్‌లో పాల్గొన్న వాహనాల సంఖ్యపైన కూడా తప్పుడు సమాచారం ఇవ్వడంద్వారా కోర్టును తప్పుదోవ పట్టించడానికి యత్నించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం బెంచ్ తీవ్రంగా తప్పుబట్టింది.

చిత్రం..డేరా సచ్చా కార్యకర్తల ఆందోళన కారణంగా పలు రైళ్లు రద్దుకావడంతో ఇదే అదనుగా భావించి అమృత్‌సర్‌లో శనివారం ట్రాక్‌కు సంబంధించిన మరమ్మతులు చేపడుతున్న రైల్వే సిబ్బంది