జాతీయ వార్తలు

కట్టలు తెంచుకొన్న ఉన్మాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచకుల (హర్యానా), ఆగస్టు 26: అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను శుక్రవారం స్థానిక కోర్టు దోషిగా ప్రకటించిన వెంటనే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున హింసాకాండకు దిగడంతో రాష్టమ్రంతా ఒక్కసారిగా భగ్గుమంది. పంచకులలో డేరా సచ్చాసౌదా బాబా మద్దతుదారులు వాహనాలను, ప్రైవేటు ఆస్తులను తగుల బెట్టడంతో పాటు హింసాకాండకు దిగారు. హింసాకాండలో శుక్రవారం ఒక్క రోజే 30 మంది చనిపోగా, 250 మందికి పైగా గాయపడ్డారు. శనివారం మరో ఏడుగురు చనిపోయారు. ఒక్క పంచకులలోనే 31 మంది మృతి చెందగా, సిర్సాలో నలుగురు చనిపోయారు. హర్యానాలో చెలరేగిన హింసాకాండ కొద్ది గంటల్లోనే పొరుగు రాష్ట్రాలయిన పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు సైతం విస్తరించాయి. పంచకుల పట్టణంలో శుక్రవారం కర్ఫ్యూ విధించారు. పంజాబ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం కర్ఫ్యూ విధించారు.
జడ్జి తీర్పును ప్రకటించిన వెంటనే కోర్టు బయట వేల సంఖ్యలో గుమి కూడిన రామ్ రహీమ్ అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయి విధ్వంసకాండకు దిగారు. మూడు గంటలపాటు ఇష్టారాజ్యంగా వాహనాలకు, ప్రైవేటు ఆస్తులకు నిప్పు పెట్టారు. పట్టణంలోని అనేక భవనాలకు, రైల్వే స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టారు. టీవీ చానళ్లకు చెందిన మూడు ఓబి వ్యాన్‌లను ధ్వంసం చేసి మీడియా సిబ్బందిపైనా దాడులు చేశారు. దీంతో పోలీసులు రామ్ రహీమ్‌ను హెలికాప్టర్‌లో రోహ్టక్‌లోని జైలుకు తీసుకెళ్లారు. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు, పారా మిలిటరీ బలగాలు విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది. వాటర్ క్యానన్లు, భాష్పవాయు ప్రయోగం జరపడంతో పాటుగా గాలిలోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.
కాగా, ఆందోళనకారుల దాడిలో ఇద్దరు ఎస్‌ఎస్‌పిలు సహా 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని హర్యానా డిజిపి బిఎస్ సంధు చెప్పారు. శుక్రవారం సాయంత్రం పంచకులలో విధించిన కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శనివారం చెప్పిన ఆయన అయితే కొన్ని ఆంక్షలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. డేరా సచ్చా సౌదా ఆశ్రమం ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సా తప్ప మిగతా రాష్టమ్రంతటా పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన చెప్పారు. శుక్రవారం పంచకుల ప్రభుత్వ ఆస్పత్రికి 17 మంది మృతదేహాలను తీసుకువచ్చినట్లు ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ వివేక్ భదు చెప్పారు. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య పరిశోధనా సంస్థ (పిజిఐఎంఇఆర్)లో ఏడుగురు, ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో మరో నలుగురు చనిపోయారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారినందరినీ శిక్షించి తీరుతామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ శుక్రవారం చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తోందని, వారందరికీ నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అధికార యంత్రాంగం వైపునుంచి కొన్ని తప్పులు జరిగినట్లు అంగీకరించిన ముఖ్యమంత్రి తప్పుచేసిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
పంజాబ్, ఢిల్లీలో సైతం..
పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో హింస, దహనకాండకు సంబంధించి కనీసం 32 సంఘటనలు జరిగాయి. ముందుజాగ్రత్త చర్యగా మాల్వా ప్రాంతంలోని పది జిల్లాల్లోను కర్ఫ్యూ విధించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ చెప్పారు. ప్రశాంతంగా ఉండాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని మాలౌట్, బల్లువాన్నా రైల్వే స్టేషన్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పాక్షికంగా తగులబడినట్లు సిఎం చెప్పారు. అల్లర్లు దేశ రాజధాని ఢిల్లీకి కూడా పాకాయి. నగరంలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుకు చెందిన రెండు బోగీలకు దుండగులు నిప్పు పెట్టారు. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ బస్సును దగ్ధం చేశారు.
ప్రధాని ఆవేదన
హర్యానాలో శుక్రవారం జరిగిన హింసాకాండ తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం కార్యదర్శి రాజీవ్ మెహ్రిషితో పరిస్థితిని సమీక్షించిన ప్రధాని, మామూలు పరిస్థితులను పునరిద్ధరించడం కోసం నిర్విరామంగా కృషి చేయాలని అధికారులను కోరారు.

చిత్రాలు.. పంచకులలో శుక్రవారం డేరా సచ్చా కార్యకర్తల ఆగ్రహానికి దగ్ధమవుతున్న వాహనాలు, షాపులు
*అల్లర్ల అనంతరం సిర్సాలో శనివారం పహరా కాస్తున్న భద్రతా దళాలు