జాతీయ వార్తలు

రోహింగ్యాలతో ముప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశ భద్రతకు తీరని ముప్పుగా తయారైన రోహింగ్యాలను పంపించివేయక తప్పదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. రోహింగ్యాల కేసు విచారణను వచ్చే నెల 3న చేపడతామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా చెప్పారు. ఇద్దరు రోహింగ్యా పౌరులు మొహమ్మద్ సలీముల్లా, మహమ్మద్ షాఖిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు చట్టం అంగీకరిస్తుందా లేదా అనేది పరిశీలించవలసిన అవసరం ఉన్నదని మిశ్రా తెలిపారు. తమను దేశంనుండి పంపించివేయటం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఇద్దరు రొహింగ్యాలు తమ పిటిషన్‌లో వాదించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు నలభై వేల మంది రోహింగ్యాలు తిష్టవేసి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీతోపాటు జమ్ము, హైదరాబాద్, మేవాత్ తదితర నగరాల్లో ఉంటున్న రోహింగ్యాలలో కొందరికి ముస్లిం ఉగ్రవాద సంస్థలు, అల్‌ఖైదా సంస్థలతో సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. దేశ భద్రతకు ముప్పుగా తయారైన రోహింగ్యాలను వారి దేశానికి పంపించివేయాలనేది కార్యనిర్వాహక విధాన నిర్ణయం, సుప్రీం కోర్టు ఈ నిర్ణయంలో జోక్యం చేసుకోరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మైన్మార్ నుండి వలసవస్తున్న రోహింగ్యాలు చాలా తీవ్రమైన సమస్యగా మారారు, దేశ భద్రతకు ముప్పుగా తయారయ్యారు, రోహింగ్యాలు దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల అక్రమ నిధులను రోహింగ్యాలు పంపిణీ చేస్తున్నారని కేంద్రం బైటపెట్టింది. ఉగ్రవాద చరిత్ర ఉన్న పలువురు రోహింగ్యాలు జమ్ము, ఢిల్లీ, హైదరాబాద్, మేవాత్ నగరాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు, మత కలహాలను రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద సంస్థలు రోహింగ్యాలను వాడుకునే ప్రమాదం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. కొందరు రోహింగ్యాలకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నదని నిఘా సంస్థలు గుర్తించాయని తెలిపింది. తీవ్రవాదులుగా మారిన రొహింగ్యాలు దేశంలోని బౌద్ధులపై పెద్దఎత్తున దాడులు చేసే ప్రమాదం ఉన్నదని కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దేశంలో నివసించే అధికారం కేవలం పౌరులకు మాత్రమే ఉన్నదని ఇతర దేశాల నుండి వలసవచ్చిన వారికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. భారతదేశానికి వలసవస్తున్న వారికి సంబంధించి ఐక్యరాజ్య సమితి తీర్మానంతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతదేశం ఈ తీర్మానంపై సంతకం చేయలేదని తెలిపింది. వలసల మూలంగా భారత పౌరుల ప్రాథమిక హక్కులపై ప్రభావం పడుతోంది, మానవ హక్కులు దెబ్బతింటున్నాయని కేంద్రం వాదించింది.
మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నాం
కోల్‌కతా: రోహింగ్యా ముస్లింల అంశం అటు మానవతాదృక్పథం ఇటు భద్రతకు సంబంధించిందని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహ్మద్ షహారియన్ అలాం అన్నారు. విదేశీ ఉగ్రవాద సంస్థలతో రొహింగ్యాలకు సంబంధాలు విషయాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు. ‘మైన్మార్ దురాగతాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు. మైన్మార్ భద్రతా దళాల దాడులకు భయపడి సుమారు 3,79,000 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చినట్టు ఐరాస గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టు 25 రక్తపాతంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రఖీనే రాష్ట్రంలో మైన్మార్ సైన్యం దురాగతాలు పెరిగిపోయానని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌కు రోహింగ్యాలు ప్రవాహంలా వచ్చిపడుతున్నారన్న మంత్రి ‘అంతర్జాతీయ సమాజం తక్షణం రంగంలోకి దిగా మైన్మార్‌పై ఒత్తిడి పెంచాలి’ అని పిలుపునిచ్చారు. వలసవాదుల రాక తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. ‘మా ప్రధాని హసీనా మానవతా దృక్పధంతో వ్యవహిస్తున్నారు. రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. వలసలు ఇలాగే కొనసాగుతాయని మేం భావించడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూస్తున్నాం’ అని అలాం వెల్లడించారు.

చిత్రం..బంగ్లాదేశ్‌లోని ఓ సహాయక శిబిరంలో సహాయం కోసం అల్లాడుతున్న రోహింగ్యాలు