జాతీయ వార్తలు

అభివృద్ధే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాహన్‌షాపూర్, సెప్టెంబర్ 23: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధే అజెండాగా పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం రెండోరోజు మోదీ పర్యటన సాగింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తోసిపుచ్చారు. ‘కొందరు రాజకీయ నాయకులు ఓట్లకోసమే రాజకీయాలు చేస్తుంటారు. మేం మాత్రం అభివృద్ధికే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మందుకు సాగుతున్నాం’ అని ప్రధాని స్పష్టం చేశారు.
దేశాభివృద్ధికే తొలి ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. ఓ పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన తరువాత మోదీ మాట్లాడుతూ బిజెపి ఓట్ల రాజకీయాలు చేయదని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని ఉద్ఘాటించారు. ప్రభుత్వం ఉన్నది రాజకీయాల కోసమో లేక ఎన్నికల్లో గెలవడానికో కాదని, జాతి ఉన్నతికి పాటుపడడానికనని మోదీ పేర్కొన్నారు. 1800 ఎకరాల్లో ఏర్పాటైన మెగా పశుప్రదర్శన గురించి మాట్లాడుతూ ‘ఈ మూగజీవాలకు బ్యాలెట్ తెలియదు. అందువల్ల ఏ పార్టీకీ ఓటు వేసే అవకాశం ఉండదు’ అని అన్నారు. 2022లో దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు జరుపుకొంటుందని, అప్పటికి పట్టణ, పల్లె అని తేడా లేకుండా ప్రతి పేదవానికి ఆవాసం కల్పించాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని వెల్లడించారు. దేశంలో అందరికీ ఇళ్లు నిర్మించడంతోపాటు ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సర్ట్ఫికెట్లు అందజేస్తూ తెలిపారు. పశుధాన్ ఆరోగ్యమేళాను ఏర్పాటుచేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలను యోగి ప్రభుత్వం అమలు చేస్తోందని మోదీ అన్నారు. పశు పోషణను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అధిక ఆదాయాన్ని కల్పించవచ్చని మోదీ స్పష్టం చేశారు. దీనివల్ల ఒక్క రైతులకే కాకుండా దేశ సంపద పెరుగుతుందని ఆయన అన్నారు.
అవినీతి నిర్మూలనకు అనేక కఠిన చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని పాలించిన సమాజ్‌వాదీ పార్టీ పేద ప్రజలను నిర్లక్ష్యం చేసిందని మోదీ ఆరోపించారు. ఇళ్లులేని పేదల జాబితాను కేంద్రానికి అందించకుండా తాత్సారం చేసిందని ఆయన విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చాక లక్షలాది మంది ప్రయోజనం పొందారని ప్రధాని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతిపైసా పేద ప్రజలకు అందాలన్నదే తమ లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని వెల్లడించారు. జిఎస్‌టివల్ల ప్రజలు, వ్యాపారస్తులకు లబ్ధి చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకు ముందు మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మోదీ ‘దీన్ని నేను అవమానంగా భావించడంలేదు. ఓ గౌరవంగా భావిస్తున్నాను’ అని చెప్పారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తాను మనసారా ఆరాధిస్తానని ప్రధాని ప్రకటించారు. ‘ఒక టాయిలెట్‌కు శంకుస్థాపన చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్ సాకారం కావాలన్న నా కల నెరవేరాలి’ అని ఆయన ఉద్ఘాటించారు. దేశాన్ని పరిశుభ్రం చేసి వ్యాధులనుంచి ప్రజలను విమక్తులను చేయడానికే స్వచ్ఛ కార్యక్రమం చేపట్టామని ఆయన వివరించారు.

చిత్రాలు..షాహన్‌షాపూర్‌లో మరుగుదొడ్డి నిర్మాణానికి శ్రమదానం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
*పశుదాన్ ఆరోగ్య మేళాలో గోవులకు మొక్కుతున్న నరేంద్ర మోదీ