జాతీయ వార్తలు

అడ్డుకున్నది కాంగ్రెస్సే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 8: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబిసి) బిల్లును రాజ్యసభలో అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ బిల్లుకు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని మంగళవారం నాడిక్కడ జరిగిన ఓ ర్యాలీలో రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఎన్‌సిబిసికి రాజ్యాంగ బద్ధత కల్పించాలని ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేశారని, కానీ ఆ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందకుండా కొందరు కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కూడా ఎన్‌సిబిసి బిల్లుకు రాజ్యాంగ బద్ధత కల్పించేందుకు ఏ శక్తీ అడ్డుకోజాలదని ఉద్ఘాటించారు. ఇందుకు సంబంధించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడిన తరగతుల వారికి అంతర్గత రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చానని, అప్పట్లో కాంగ్రెస్, బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీలు వ్యతిరేకించినా కూడా తాను ముందుకు వెళ్లానని తెలిపారు. కర్నాటకలో వెనుకబడిన తరగతుల వారికి 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నప్పటికీ దీనివల్ల ప్రయోజనం పొందింది అతి తక్కువమందేనని రాజ్‌నాథ్ అన్నారు. యుపిఏ హయాంలో విజయ్‌మాల్యా వంటి వ్యక్తులకు కోట్లాది రూపాయల మేర బ్యాంకు రుణాలు లభించాయని, పేదలకు మాత్రం ఎలాంటి లబ్ధి చేకూరలేదని ధ్వజమెత్తారు. కానీ తమ ప్రభుత్వం ముద్రా యోజన ద్వారా పేదలకు ఎంతగానో సాయపడుతోందని స్పష్టం చేశారు.
భారత్ సూపర్ పవర్
చైనాతో తలెత్తిన డోక్లామ్ వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావడానికి కారణం భారతదేశం సూపర్ పవర్ కావడమేనని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం బెంగళూరు పాలెస్ మైదానంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన ‘ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు విస్తృత స్థాయిలో ఇనుమడించాయి’ అని స్పష్టం చేశారు. దాదాపు 71 రోజుల పాటు నువ్వా నేనా అనే రీతిలో సాగిన డోక్లామ్ వివాదాన్ని భారత్ - చైనాలు సామరస్యపూర్వక రీతిలో పరిష్కరించుకున్న విషయం తెలిసిందే. ఈ 71 రోజులు భారతదేశం ఎలాంటి కవ్వింపులకు ఒడిగట్టకుండా అత్యంత పరిణత రీతిలో వ్యవహరించిందని, ఆవిధంగా అంతర్జాతీయంగా తనకున్న స్థాయిని, హోదాను, శక్తిని నిరూపించుకుందని రాజ్‌నాథ్ అన్నారు. భారతదేశం ఏమాత్రం తన పట్టుదలను సడలించినా ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారమై ఉండేది కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ తీవ్ర సమస్య పరిష్కారం కావడంతో ఇతర వివాదాలను అదే స్థాయి సామరస్యంతో పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇటు దౌత్యపరంగా, అటు ఆర్థికంగా కూడా ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు.

చిత్రం..విశ్వకర్మ మహాసభ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌ను సన్మానిస్తున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్