జాతీయ వార్తలు

‘నకిలీ’యే ఉగ్రవాద ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: అత్యంత నాణ్యత కలిగిన నకిలీ నోట్లు ఉగ్రవాదులకు ప్రాణవాయువులా పని చేస్తూ, సమాజానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగరికత కలిగిన ఏ దేశమూ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ఉపేక్షించదన్నారు. ‘నకిలీ కరెన్సీ ఉగ్రవాదాన్ని పోషిస్తుంటే, అత్యంత నాణ్యత కలిగిన నకిలీ నోట్లు ఉగ్రవాదులకు ఊపిరి అవుతోంది’ అన్నారు. ప్రగతి నిరోధక ఉగ్రవాదాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచి వేస్తోందని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాద ముప్పును ప్రస్తావించడంలో భారత్ బలమైన అడుగులే వేసిందంటూ, ఉగ్ర ముప్పు ఎదుర్కొంటోన్న దేశాలను ఒక తాటిపైకి తేవడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారన్నారు. జమ్ముకశ్మీర్‌లోని ఉగ్ర మూకలకు బయటినుంచి ఆర్థిక సహకారం అందకుండా చేసి, ఉగ్రవాద ఆయువు పట్టుపై ఎన్‌ఐఏ బలమైన దెబ్బ కొట్టిందని ప్రశసించారు. ఉగ్రవాద ఘటనల్లో సరైన సాక్ష్యాలు సేకరించటం సులువైన పని కాదంటూనే, ఈ విషయంలో 95 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలుపడేలా జాతీయ దర్యాప్తు సంస్థ అద్భుత పనితీరు ప్రదర్శించిందని రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఉగ్ర మూకలను అరికట్టడంలో కేంద్రం, రాష్ట్రాల నుంచి ఎన్‌ఐఏకు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ‘నైపుణ్యమైన, శాస్ర్తియమైన దర్యాప్తుతో గత ఎనిమిదేళ్లలో ఎన్‌ఐఏ ఎనలేని కీర్తిని ఆర్జించుకుంది’ అని హోంమంత్రి కితాబునిచ్చారు. పాలనాపరమైన అంశాల్లో స్వతంత్ర ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్‌ఐఏను కేంద్రం అనుమతించిన విషయాన్ని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జయ్‌పై ఆరోపణలు ఆధారరహితం
అమిత్ షా కుమారుడు జయ్ షాపై వచ్చిన అభియోగాల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఎలాంటి దర్యాప్తూ అవసరం లేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత జయ్ నిర్వహిస్తున్న కంపెనీలో అనూహ్యంగా పెట్టుబడులు పెరిగాయంటూ ఓ న్యూస్‌పోర్టల్‌లో కథనం రావడం తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేపిన కాంగ్రెస్, పెట్టుబడుల వ్యవహారంపై ప్రధాని మోదీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. అమిత్‌ను బిజెపి అధ్యక్ష పీఠం నుంచి తప్పించి, ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు జడ్జి చేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

చిత్రం..ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్