జాతీయ వార్తలు

మోగిన హిమాచల్ భేరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించిన కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను డిసెంబర్ 18 తేదీలోపే నిర్వహిస్తామని ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు నవంబర్ తొమ్మిదో తేదీన ఒకే దశలో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా కేవలం మహిళలు మాత్రమే నిర్వహించే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం గమనార్హం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏ.కె.జ్యోతి గురువారం విలేఖరులతో మాట్లాడుతూ నేటినుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవిఎంలతోపాటు వివిపిటి (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇదివరకే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల షెడ్యూలు రావటంతో మరింత ఉద్ధృతంగా ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపొందేందుకు బిజెపి అన్ని రకాల ఆయుధాలను ప్రయోగించనుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 16న జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలు 23 నుండి ప్రారంభం అవుతుంది. 24న నామినేషన్ల పరిశీలన, 26వ తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకోవలసి ఉంటుంది. పోలింగ్ నవంబర్ 9న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 18న జరుగుతుంది. ఇలావుండగా ప్రతి నియోజకవర్గంలో రెండు ఓటింగ్ కేంద్రాలను కేవలం మహిళలు మాత్రమే
నిర్వహిస్తారని జ్యోతి ప్రకటించారు. ఓటింగ్‌లో పాల్గొన్నవారి సంఖ్యను వివిపిటిలతో సరిపోల్చే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ చట్టానికి లోబడి జరిగేలా చూసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్యోతి చెప్పారు. పెయిడ్ వార్తల సమస్యను పరిష్కరించేందుకు కూడా పలు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గుజరాత్ శాసనసభ ఎన్నికలను
డిసెంబర్ 18లోగా నిర్వహిస్తామని, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం గుజరాత్‌పై పడకుండా చూస్తామని ఆయన చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ మొత్తం సీట్ల సంఖ్య 68 కాగా ఇందులో 17 ఎస్‌సి, 3 ఎస్‌టికి రిజర్వు చేశారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ 2018 జనవరి 7తో ముగుస్తుంది.