జాతీయ వార్తలు

వర్సిటీలకు ఇక స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, అక్టోబర్ 14: ప్రపంచ వ్యాప్తంగా అగ్రభాగాన ఉన్న 500 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో మన దేశంలోని ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేకపోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మన యూనివర్శిటీలను ప్రపంచంలోని ఉత్తమ యూనివర్శిటీలుగా తీర్చిదిద్దడానికి వాటికి స్వేచ్ఛనివ్వాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన వెల్లడించారు. దేశంలోని 20 యూనివర్శిటీలను ఎంపిక చేసి, వాటికి రూ.పది వేల కోట్ల నిధులు అందజేసి, అవి ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాలుగా ఎదిగేలా చేస్తామని ఆయన వివరించారు. శనివారం ఇక్కడ జరిగిన ప్రతిష్ఠాత్మక పాట్నా విశ్వవిద్యాలయ శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలకు కేంద్ర హోదాను ఇవ్వడమనేది పాత పద్ధతని, తన ప్రభుత్వం పది ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, పది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలుగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగు వేసిందని అన్నారు. ‘ఐఐఐఎంలకు ఉన్న సంకెళ్లను తొలగించే దిశగా నా ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఆంక్షలు, నియంత్రణల పేరిట ఉన్న ప్రభుత్వ సంకెళ్ల నుంచి వాటిని విముక్తి చేసింది’ అని ప్రధాని మోదీ అన్నారు. మన యూనివర్శిటీలకు ఇదే రకమైన స్వేచ్ఛను ఇవ్వాలని భావిస్తున్నామని, ఫలితంగా ప్రపంచంలోని 500 ఉత్తమ విశ్వవిద్యాలయాలలో వాటికి చోటు దక్కేలా చూస్తామని అన్నారు. సుమారు అర గంట సేపు సాగిన తన ఉపన్యాసంలో మోదీ.. విశ్వవిద్యాలయాలు విద్యార్థులను జ్ఞానసంపన్నులను చేయడంపైన, ఆవిష్కరణలపైన మరింత కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల మెదళ్లలో సమాచారాన్ని నింపడంపై కేంద్రీకరించే పాత విద్యాబోధన పద్ధతులకు స్వస్తి పలకాలని అన్నారు.
పాట్నా విశ్వవిద్యాలయానికి కేంద్ర హోదాను ఇవ్వాలని అంతకు ముందు తన స్వాగతోపన్యాసంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. నితీశ్ ఈ విజ్ఞప్తి చేసినప్పుడు సభలో పాల్గొన్న యువత పెద్దగా కరతాళ ధ్వనులు చేశారు. అయితే మోదీ మాత్రం తన ఉపన్యాసంలో తనదైన రీతిలో దీనికి బదులిచ్చారు. ‘ఈ కార్యక్రమంలో వచ్చిన డిమాండ్‌పై, దానికి యువత స్పందించిన తీరుపై నేనో విషయం చెప్పదలచుకున్నాను. సెంట్రల్ స్టేటస్‌ను మంజూరు చేయడం వంటి అంశాలు పాతవైపోయాయి. మేము మరో ముందడుగు వేస్తున్నాం’ అని ప్రధాని అన్నారు. ‘మేము అయిదేళ్ల కాలం పాటు పది ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు, అందే సంఖ్యలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు రూ. పది వేల కోట్ల సాయం చేస్తాం. ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి యూనివర్శిటీలుగా ఎదగాలి’ అని మోదీ అన్నారు. ఈ విశ్వవిద్యాలయాలను ప్రధాన మంత్రి కాని ముఖ్యమంత్రి కాని మరో రాజకీయవేత్త కాని ఎంపిక చేయరు. ఈ యూనివర్శిటీల సామర్థ్యాన్ని ఒక నిపుణుడు, మూడో పక్షమైన సంస్థ అంచనా వేస్తుందని పేర్కొన్నారు. పాట్నా యూనివర్శిటీ ఈ అవకాశాన్ని దక్కించుకుంటుందని తాను ఆశిస్తున్నానని, ఆకాంక్షిస్తున్నానని మోదీ అన్నారు.
800 మిలియన్ల యువత ఉన్న దేశం మనదని, మన దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారేనని పేర్కొంటూ, అందువల్ల మనం సాధించలేనిది ఏమీ లేదని ప్రధాని అన్నారు. సుసంపన్నమైన బిహార్ చరిత్రను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. జ్ఞాననిలయమైన బిహార్ భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునే 2022 నాటికి సుసంపన్నమైన రాష్ట్రంగా ఎదుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మోదీ బిహార్ మ్యూజియంను సందర్శించారు.

చిత్రం..బిహార్ పర్యటనలో భాగంగా పాట్నాలోని మ్యూజియంను
తిలకిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, సిఎం నితీశ్‌కుమార్