జాతీయ వార్తలు

కులతత్వానికి, అభివృద్ధికి మధ్య పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావ్‌నగర్, నవంబర్ 21: గుజరాత్ శాసనసభ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న సమరం కాదని, నిజానికి ఇది కులతత్వానికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న యుద్ధమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కులతత్వానికి, వారసత్వ రాజకీయాలకు ప్రతీకగా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు అభివృద్ధికి సరికొత్త మార్గాలు తెరిచాయని ఆయన మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ ర్యాలీలో అన్నారు. గుజరాత్‌ను ఓ పర్యాటక కేంద్రంగా భావించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కులతత్వం, వారసత్వ రాజకీయాల కంటే అభివృద్ధినే గుజరాత్ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జీతూ వఘానీ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ అమిత్ షా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతునివ్వడంతో 1985-1995 మధ్య కులరాజకీయాలు నడిచాయని, బీజేపీని గెలిపించడంతో 1995-2017 మధ్య అనూహ్యమైన ప్రగతిని, స్థిరమైన పాలనను చవిచూశారని ఆయన వివరించారు. గతంలో ‘కెహెచ్‌ఎఎం’ (క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లింలు) సిద్ధాంతాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ ఇపుడు కులాల మధ్య అంతరాలు సృషిస్తోందన్నారు. కులతత్వం, వారసత్వం, మైనారిటీలను బుజ్జగించడం , అభివృద్ధి అనే అంశాల్లో దేన్ని ఆశ్రయించాలో గుజరాత్ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కులతత్వం, వారసత్వం అనే అవలక్షణాలకు అతీతంగా నరేంద్ర మోదీ నేడు దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని షా తెలిపారు. గుజరాత్‌లో పదేపదే పర్యటిస్తున్న రాహుల్ గాంధీ పదేళ్ల యుపీఏ పాలనలో ఎంతో చేశామని చెబుతున్నారని, అదే నిజమైతే 2014లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో మోదీ అధికారం చేపట్టాక బుల్లెట్ ట్రైన్ వంటి అత్యాధునిక సౌకర్యాలు సాకారమవుతున్నాయన్నారు. గుజరాత్‌లో అనేక సమస్యలను పరిష్కరించడమే గాక సౌరాష్ట్ర ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్‌పోర్టుకు అనుమతి మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు.

చిత్రం..గుజరాత్‌లోని భావనగర్‌లో మంగళవారం బీజేపీ నిర్వహించిన ర్యాలీలో అభిమానులు ఇచ్చిన కరవాలంతో ఆ పార్టీ అధినేత అమిత్ షా