జాతీయ వార్తలు

సౌభ్రాతృత్వాన్ని సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: రాజ్యంలోని మూడు విభాగాలయిన న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాల పంపిణీ ఎంతో జఠిలమయినదని, కీలకమయినదని, ఈ మూడు విభాగాలూ సమానమైన హోదా గలవని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఈ మూడు వ్యవస్థల మధ్య అధికారాల విభజనలో గల సున్నితమైన సమతుల్యతను, సాభ్రాతృత్వాన్ని కొనసాగించాలని, చెదరగొట్టకూడదని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యంలోని ఈ మూడు వ్యవస్థలు తమ స్వేచ్ఛ పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ స్వయంప్రతిపత్తిని కాపాడుకోవటానికి పాటుపడాలని ఆయన ఉద్బోధించారు. అయితే ఈ మూడు వ్యవస్థలు కూడా తెలిసి కాని, తెలియకుండా కాని మరో వ్యవస్థ అధికారాల పరిధిలోకి చొరబడకూడదని ఆయన సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుప్రీంకోర్టు ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మారకూడనిదేమీ కాదని, అదొక సజీవ పత్రమని అన్నారు. రాజ్యంలోని ఈ మూడు విభాగాల మధ్య సమాచార మార్పిడిలో సంయమనం, విచక్షణ పాటించడం ఎంతయినా అవసరమని ఆయన సూచించారు. దీని వల్ల ఈ మూడు విభాగాల మధ్య సౌభ్రాతృత్వం మరింత పెరుగుతుందని అన్నారు. రాజ్యాంగం అమలులో ఈ మూడు వ్యవస్థలకు నిర్దిష్టమయిన బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం సురక్షితంగా ఉందని, పరిణతి చెందిన వారి చేతుల్లో ఉందని సామాన్య ప్రజలకు మళ్లీ హామీ ఇవ్వాలని ఆయన అన్నారు.
దేశ వ్యాప్తంగా గల హైకోర్టులు తమ తీర్పులను స్థానిక, ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసి, ధ్రువీకరించిన ప్రతులను కక్షిదారులకు వీలయినంత త్వరగా సరఫరా చేయాల్సిన లక్ష్యాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉందని రాష్టప్రతి అన్నారు. వీలయితే, కోర్టుల్లో సాగే విచారణలు సాధారణ కక్షిదారులు అర్థం చేసుకునే భాషలో ఉండేలా చూడాలని ఆయన సూచించారు. కేసుల పరిష్కారం కూడా వేగంగా అయ్యేట్లు చూడాలన్నారు.
ప్రాథమిక హక్కుపై రాజీ లేదు: సీజేఐ
ప్రాథమిక హక్కుల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. పరిపాలించడానికి ఎన్నికయిన ప్రజాప్రతినిధుల చేతుల్లోనే పాలన ఉండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అంతకు ముందు చేసిన వ్యాఖ్యలపై సీజేఐ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజాహిత వ్యాజ్యాలు (పిల్‌లు) పాలనకు ప్రత్యామ్నాయం కాజాలవు’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ ప్రజాహిత వ్యాజ్యాల పట్ల, రాజ్యాంగ సార్వభౌమాధికారం పట్ల సుప్రీంకోర్టుకు విశ్వాసం ఉందని అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చాలా ముఖ్యమయినవని, రాజ్యాంగ సమీక్ష అధికారాలు గల స్వయంప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ రాజ్యాంగ పరిరక్షణ కోసం నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన పరిధిలో పనిచేసేలా, రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలు అనుభవించేలా న్యాయ వ్యవస్థ చూస్తుందన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుల విషయంలో న్యాయ వ్యవస్థ రాజీపడబోదని ఆయన స్పష్టం చేశారు.

చిత్రం..రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన రాష్టప్రతిని ఆహ్వానిస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా