జాతీయ వార్తలు

రాహుల్‌కు పగ్గాలిస్తే రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధ్యక్షుడుగా నియమిస్తే రాజీనామా చేసి స్వంత పార్టీని ఏర్పాటు చేసుకుంటానని చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అజిత్ జోగి హెచ్చరించి సంచలనానికి తెరతీశారు. రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించటాన్ని పలువురు సీనియర్ నాయకులు గట్టిగా వ్యతిరేకిస్తున్న తరుణంలో అజిత్‌జోగి తిరుగుబాటు బావుటా ఎగురవేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అజిత్ జోగి గురువారం ట్విట్టర్‌లో ఈ మేరకు ఒక సందేశం పెట్టారు. ఈ నెల 6న తన నియోజకవర్గంలో శ్రేయోభిలాషుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాననీ, పార్టీ కార్యకర్తలు, సమర్థులు, శ్రేయోభిలాషులతో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్థారించుకుంటానని అజిత్ జోగి ఆ సందేశంలో పేర్కొన్నారు. అజిత్ జోగి హెచ్చరికతో బెంబేలెత్తిన పార్టీ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్‌తోపాటు పలువురు సోనియా అధ్యక్షతన వార్ రూంలో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అజిత్ జోగి రాజీనామా చేయకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వ్యూ హాన్ని అనుసరించాలనే దాని గురించి సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. అజిత్ జోగి బాటలో మరికొందరు సీనియర్లు వెళ్లే పక్షంలో పార్టీ పరిస్థితి ఏమిటనేది కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. అజిత్ జోగి మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్‌ను వీడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించటంతోపాటు ఏఐసిసి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సమూల మార్పులు చేయాలనే ప్రతిపాదనపై పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీని వెంటనే పార్టీ అధ్యక్షుడుగా ప్రకటించాలని యువ నాయకులు డిమాండ్ చేస్తుంటే సీనియర్లు మాత్రం తొందరపడటం మంచిది కాదని వాదిస్తున్నారు. రాహుల్ గాంధీని అధ్యక్షుడుగా నియమించినా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా సోనియా కొనసాగాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అరవై శాతం పదవులు యువకులకు, నలభై శాతం పదవులు సీనియర్లకు ఇవ్వటం ద్వారా పార్టీలో రాజకీయపరమైన సమతూకాన్ని సాధించటం మంచిదనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు.