జాతీయ వార్తలు

‘పద్మావతి’ కల్పితం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: చారిత్రక కథాంశం ఇతివృత్తంగా నిర్మితమైన ‘పద్మావతి’ చిత్రానికి సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ ఆ చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ ప్యానెల్ ముందు హాజరైన బన్సాలీ ‘పద్మావతి - పూర్తి కల్పిత చిత్రం. ఇందులో చరిత్రను వక్రీకరించిన అంశాలేవీ లేవు’ అని స్పష్టం చేశారు. 500 సంవత్సరాల క్రితం రాసిన ఓ పద్యాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన కల్పిత కథాంశంగా పద్మావతి చిత్రాన్ని బన్సాలీ అభివర్ణించారు. రెండు పార్లమెంటరీ ప్యానెళ్లు పద్మావతి వివాదానికి సంబంధించి తాజా పరిణామాలను విశే్లషించాయి. వీటిలో ఓ ప్యానెల్ ముందు బన్సాలీ హాజరయ్యారు. ఓ సినిమాను సెన్సార్‌బోర్డు ఆమోదించకముందు దానిపై పార్లమెంటరీ ప్యానెల్ చర్చ జరపడమన్నది దేశంలో ఇదే మొదటిసారి. ఈ వివాదానికి సంబంధించి రెండు వారాల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని బన్సాలీని ఈ ప్యానెల్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్లమెంటరీ ప్యానెళ్లు కూడా బిజెపి ఎంపీల సారథ్యంలోనే ఉన్నవి కావడం గమనార్హం. దాదాపు మూడు గంటలపాటు సమాచార టెక్నాలజీపై ఏర్పాటైన ప్యానెల్ సభ్యులు బన్సాలీని ప్రశ్నించారు. దాదాపు 500 సంవత్సరాల క్రితం సూఫీ కవి మాలిక్ మహ్మద్ జయసీ ‘పద్మావతి’ పేరుతో ఓ పద్యం రాశారని, దాని ఆధారంగానే తాను ఈ కల్పిత కథను తెరకెక్కించానని బన్సాలీ వివరించారు. 1540 ప్రాంతంలో మహమ్మద్ జయసీ ఈ పద్యాన్ని రాసినట్లుగా భావిస్తున్నారు. అయితే చరిత్రకు సంబంధించిన కొన్ని పాత్రలు, సంఘటనలతో కూడిన చిత్రాన్ని కల్పిత కథాంశంగా ఎలా భావించగలుగుతామని కొందరు సభ్యులు బన్సాలీని ప్రశ్నించారు. అయితే కేవలం వదంతుల కారణంగానే ఈ చిత్రంపై వివాదం చెలరేగిందని బన్సాలీ వివరించినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ ఆమోదం పొందకుండానే ఈ చిత్రాన్ని మీడియాలోని కొన్ని వర్గాలకు ఎలా ప్రదర్శిస్తారు? ఇది సెన్సార్ బోర్డును ప్రభావితం చేసే ప్రయత్నమా? అని కమిటీ సభ్యులు కొందరు బన్సాలీని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 11న ఈ చిత్రాన్ని సెన్సార్ పరిశీలనకు పంపి డిసెంబర్ 1నే విడుదలవుతుందని ఎలా ప్రచారం చేసుకోగలుగుతారని మరో సభ్యుడు ప్రశ్నించారు. ఇంకొందరైతే సినిమాను అమ్ముకోవాలన్న ఉద్దేశంతోనే వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారా అని కూడా మరో సభ్యుడు బన్సాలీని అడిగినట్లుగా అభిజ్ఞవర్గాల కథనం. కాగా, ఈ చిత్రాన్ని తాము ఆమోదించలేదని, దీనిపై నిపుణుల సలహా కోరుతున్నామని సెన్సార్‌బోర్డు చీఫ్ జోషి పిటిషన్లపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌కు స్పష్టం చేశారు. నేటి ప్యానెల్ సమావేశానికి హాజరైన బిజెపి సీనియర్ నాయకుడు అద్వానీ, కాంగ్రెస్ సభ్యుడు రాజ్‌బబ్బర్ తదితరులు ఉన్నారు.

చిత్రం..దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ