జాతీయ వార్తలు

మీ తప్పులకు గుజరాతీలు మూల్యం చెల్లించాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: రోజుకో కొత్త ఆరోపణతో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దూకుడును మరింతగా పెంచారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆయన మోదీని విమర్శించడమే కాదు, తన ప్రశ్నలకు సమాధానాలివ్వాలంటూ స్వరం పెంచుతున్నారు. రాహుల్ శుక్రవారం ఎన్నికల ప్రచారంలో గుజరాతీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు.
‘ఆర్థిక సంస్కరణలంటూ మోదీ చేసిన తప్పుడు నిర్ణయాలకు గుజరాత్ ప్రజలు మూల్యం చెల్లించాలా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘మోదీకి రోజుకో ప్రశ్న’లో భాగంగా రాహుల్ శుక్రవారం తన రెండో ప్రశ్నను సంధించారు. గుజరాత్ వ్యవహారాలకు సంబంధించి తాను వేస్తున్న రెండో ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 1995 నాటికి గుజరాత్‌పై 9,183 కోట్ల రూపాయల రుణభారం ఉందని, ఈ ఏడాది అది 2.41 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం ప్రతి గుజరాత్ పౌరుడిపై 37వేల కోట్ల రూపాయల చొప్పున అప్పు ఉందని, మోదీ నిర్వాకానికి ప్రజలు మూల్యం చెల్లించాలా? అని రాహుల్ నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలుచేశారో బేజేపీ నేతలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 22 ఏళ్ల బీజేపీ పాలనలో ఏం సాధించారన్న విషయమై గుజరాత్ యావత్తూ సమాధానాల కోసం ఎదురుచూస్తోందన్నారు. అధికారంలోకి వస్తే 50 లక్షల ఇళ్లు నిర్మిస్తామని గత ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చినా, ఇప్పటికి 4.72 లక్షల గృహాలను మాత్రమే నిర్మించారని వివరించారు. మిగతా ఇళ్లను నిర్మించేందుకు మరో 45 ఏళ్లు అధికారం కావాలా? అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారు తెలివిలేని వారా?
-చిదంబరం
‘వస్తు సేవా పన్ను (జీఎస్టీ)ని 18 శాతానికి పరిమితం చేయాలని కోరుతున్న ఆర్థిక సలహాదారులు తెలివిహీనులా?’ అని కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రధాని మోదీని ప్రశ్నించారు. జిఎస్టీని 18 శాతానికి పరిమితం చేయాలన్న కాంగ్రెస్ పార్టీపై మోదీ విమర్శలు చేస్తున్నారని, అదే దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణ్యం వంటి ఆర్థిక నిపుణులు తెలివితక్కువ వారా? అని ఆయన ట్విట్టర్‌లో నిలదీశారు. జిఎస్‌టి విధానంపై మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. జిఎస్టీని 18 శాతానికి పరిమితం చేయాలని ‘కొందరు’ తెలివితక్కువగా మాట్లాడుతున్నారని రాహుల్ ప్రశ్నలకు మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో చిదంబరం వరుస ట్వీట్లతో మోదీపై విరుచుకుపడ్డారు. ‘ముఖ్య ఆర్థిక సలహాదారు ఇచ్చిన నివేదికను మోదీ చదివారా? రెవెన్యూ న్యూట్రల్ రేటు అంటే ఏమిటో తెలుసా? ధరలు ఎలా తగ్గుతాయి? ఎలా పెరుగుతాయి? క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయని తెలుసా? విద్యుత్ రంగం కూడా అస్తవ్యస్తంగా ఉంది.. అయితే ఆర్థిక వ్యవస్థతో అంతా బాగుందని ప్రభుత్వం చెప్పుకుంటోంది..’ అని చిదంబరం అన్నారు.
చిత్రం..గుజరాత్‌లోని అమ్‌రేలీ జిల్లాలో గురువారం జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ