జాతీయ వార్తలు

‘ఓఖి’ కల్లోలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవరట్టి/తిరువనంతపురం/చెన్నై, డిసెంబర్ 2: దక్షిణ తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఓఖి తుపాన్ కుదిపేసింది. అలాగే లక్షద్వీప్ దీవుల్లో అల్లకల్లోలం సృష్టించింది. ఉద్ధృతమైన గాలులు, భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. కల్పేని దీవిలో శనివారం ఉదయం ఐదు బోట్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లక్షద్వీప్‌లో మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటుందని, 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజా నివేదికల ప్రకారం మినీకాయ్ ద్వీపంలో అత్యధికంగా 14 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు కల్పేని, మినీకాయ్‌లో కొబ్బరి తోటలు ధ్వంసమయ్యాయి. బలమైన గాలుల ప్రభావంవల్ల కొబ్బరి చెట్లు కూకటివేళ్లతో నేలకొరిగాయని అధికారులు వెల్లడించారు. ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని వారన్నారు. కేరళ, తమిళనాడు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపుసాగుతోంది. ఇక గాలేలో 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. లక్షద్వీప్‌లో అయితే 145 కిలోమీటర్లకు పైనే ఉద్ధృతమైన గాలులు ఉన్నాయని వాతావరణ శాఖ బులెటిన్ పేర్కొంది. ఇక కేరళ తీరప్రాంతంలో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. శుక్రవారం సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన 218 మంది మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నావీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్ గార్డ్ సమష్టి కృషి ఫలించింది.
పళని స్వామికి ప్రధాని ఫోన్
ఓఖి తుపాను వల్ల నష్టపోయిన తమిళనాడును అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఓఖి తీవ్రత, సంభవించిన నష్టంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. ఓఖి ప్రభావం వల్ల కన్యాకుమారి, తిరునెల్వెలి జిల్లాల్లో పౌర జీవనం దుర్భరంగా మారింది. ‘రాష్ట్రానికి జరిగిన నష్టంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన చెందారు. అన్ని విధాలా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు’ అని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. మరోపక్క తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన చేపట్టినట్టు పళనిస్వామి స్పష్టం చేశారు. ఏడు జిల్లాలో ఓఖి కల్లోలం సృష్టించిందని, కన్యాకుమారి, తిరునెల్వెలి జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆయన అన్నారు. పరిస్థితి అంచనా వేయడానికి సీనియర్ మంత్రులు, ఏఐఎస్ అధికారులను రంగంలోకి దించారు. ఓఖి తుపాను వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్రాన్ని కోరారు. గల్లంతైన జాలర్ల ఆచూకీ తెలుసుకోవడానికి నావీ, కోస్ట్‌గార్డ్‌ను రంగంలోకి దించాలని ఆయన అభ్యర్థించారు. తమిళనాడులో నెలకొన్న తాజా పరిస్థితులను కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తెచ్చారు. చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లిన జాలర్ల ఆచూకీ తెలియడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని రాజ్‌నాథ్ భరోసా ఇచ్చారు.
జాలర్లు సురక్షితం: కేరళ ముఖ్యమంత్రి
తిరువనంతపురం: కల్లోలంగా మారిన సముద్రంలో చిక్కుకుపోయిన సుమారు 531మంది జాలర్లను రక్షించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరవి విజయన్ శనివారం వెల్లడించారు. కేరళలోనే 393మంది జాలర్లను రక్షించినట్లు తెలిపారు. తిరువనంతపురంకు చెందిన 132మంది, కోజికోడ్ నుంచి 66మంది, కొల్లాంకు చెందిన 55మంది, త్రిశూర్‌కు చెందిన 40మంది, కన్యాకుమారికి చెందిన 100మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. లక్షద్వీప్ తీరంనుంచి 138మంది జాలర్లను రక్షించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు మత్స్యశాఖ ఇచ్చే నాలుగు లక్షల పరిహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 10 లక్షల సాయం అందించనున్నట్లు విజయన్ తెలిపారు.

చిత్రం.. కన్యాకుమారిలో తెగిపోయన రోడ్డు