జాతీయ వార్తలు

రాహులొక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: యువశకానికి కాంగ్రెస్ నాంది పలికింది. వారసత్వ రాజకీయాల్లో భాగంగా అంతా ఊహించినట్టే ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ఒక్కరే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇతర నేతలెవ్వరూ నామినేషన్ వేయకపోవటంతో రాహుల్ ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం వీటిని పరిశీలించిన తరువాత అన్ని వివరాలూ వెల్లడిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సంఘం అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నామినేషన్లకు సోమవారమే చివరి రోజు. సోమవారం సాయంత్రం మూడున్నర గంటల వరకూ కేవలం రాహుల్ గాంధీ నామినేషన్ మాత్రమే దాఖలు చేయటంతో ఆయన ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కేవలం రాహుల్ మాత్రమే నామినేషన్ వేశారా? లేక ఇతరులెవరైనా నామినేషన్లు దాఖలు చేశారా? అన్న ప్రశ్నకు రామచంద్రన్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 89 నామినేషన్ పత్రాలు పరిశీలించిన తరువాత మంగళవారం అన్ని వివరాలు వెల్లడిస్తామంటూ తప్పించుకున్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఇతర సీనియర్లు, సిఎంలు, పీసీసీ అధ్యక్షులు కలిసి మొత్తం 89 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వీటిపై 890మంది పీసీసీ డెలిగేట్లు సంతకాలు చేశారని ఆయన వెల్లడించారు. అయితే రాహుల్‌తోపాటు మరెవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారా? నామినేషన్ వేశారా? అంటూ మీడియా పలుమార్లు ప్రశ్నించినా, ఆయన మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 11. అప్పటి వరకు మీరు వేచి ఉండాల్సిందే’ అని రామచంద్రన్ వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికయ్యారని అనిపించేందుకే ముళ్లపల్లి రామచంద్రన్ వివరాలు వెళ్లడించటం లేదని అంటున్నారు.
రాహుల్ గాంధీ సోమవారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ పేరును మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మ, పంజాబ్ సిఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, కర్నాటక సిఎం సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ సిఎంలు, మాజీమంత్రులు ప్రతిపాదించగా పలువురు సీనియర్ నేతలు బలపర్చారు. మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం, జైపాల్‌రెడ్డి, సుశీల్‌కుమార్ షిండే తదితరులు రాహుల్‌ను బలపర్చిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రాల నుంచి దాఖలైన నామినేషన్ పత్రంపై పదిమంది చొప్పున పీసీసీ డెలిగేట్లు సంతకాలు చేశారు. ఒక్కో రాష్ట్రం నుంచి రెండేసి నామినేషన్ పత్రాలు దాఖలు కాగా, ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, జనాభా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని నామినేషన్ పత్రాల దాఖలుపై కొంత మినహాయింపు ఇచ్చారు. తెలంగాణ నుంచి మూడు సెట్లు, కేరళ నుంచి నాలుగు సెట్లు, ఉత్తరప్రదేశ్ నుండి ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ప్రతి నామినేషన్ పత్రంపై రాహుల్ సంతకం చేశారు. వీటిని ఆయా రాష్ట్రాల సీనియర్లు ఎన్నికల అధికారి రామచంద్రన్‌కు అందించారు. రాహుల్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ వద్దకెళ్లి వారి ఆశీర్వాదం తీసుకోవటం గమనార్హం. మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ రాహుల్‌గాంధీకి తిలకందిద్ది ఆశీర్వదించటం అందరి దృష్టినీ ఆకర్షించింది.
రాహుల్ నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి కర్నాటక సిఎం సిద్దరామయ్యతోపాటు కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సిఎంలు, మాజీ కేంద్ర మంత్రులు పి చిదంబరం, రేణుకాచౌదరి, ఏకె ఆంటోని, సుశీల్‌కుమార్ షిండే, ఎస్ జైపాల్‌రెడ్డి, రాజ్యసభలో కాంగ్రెస్‌పక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ తదితరులు హాజరయ్యారు. రాహుల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలంటూ అన్ని పీసీసీలూ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు చేసి పంపటంతో, ఇతర నేతలెవ్వరూ పార్టీ అధ్యక్ష పదవి పోటీకి దిగలేదు. గాంధీ కుటుంబీకులే కాంగ్రెస్‌ను ఒకటిగా ఉంచగలుగుతారు. ఆందుకే రాహుల్‌ని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్టు పలువురు సీనియర్, జూనియర్లు ఏఐసీసీ కార్యాలయం వద్ద బహిరంగంగా ప్రకటించారు. ‘రాహుల్ మా ప్రియతమ నేత. అతను మాత్రమే కాంగ్రెస్‌ను ముందుకు నడిపించగలడు’ అని పార్టీలోని యువనేతలు ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రతి చిన్న, పెద్ద నాయకుడూ రాహుల్ నాయకత్వాన్ని కోరుతున్నారని మన్మోహన్ సింగ్ ప్రకటించటం గమనార్హం. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు రాహుల్ ఏఐసీసీకి వచ్చినప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. దీంతో ఏఐసీసీ వద్ద పండుగ వాతావరణం కనిపించింది.
పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ 1998లో పార్టీ బాధ్యతలు చేపట్టటం అందరికీ తెలిసిందే. ఆమె దాదాపు 19ఏళ్లపాటు కాంగ్రెస్ అధినేత్రిగా కొనసాగారు. రాహుల్ గాంధీ (47) కూడా పార్టీ అధ్యక్ష పదవిలో దాదాపు 20ఏళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌లో పెద్దఎత్తున మార్పులు, చేర్పులు జరుగనున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్, సోనియాకు సన్నిహితులుగా ఉంటూ పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన సీనియర్లకు ఇక పార్టీలో ప్రాధాన్యత తగ్గటం ఖాయం. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పష్టం చేశారు. సీనియర్ల స్థానంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న రాహుల్ ప్రతిపాదనపై, పార్టీలో ఇప్పటికే తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. సీనియర్లను పక్కకు తప్పిస్తే కాంగ్రెస్‌కు తీరని నష్టం జరుగుతుందని పలువురు నేతలు వాదించటంతోపాటు సోనియా దృష్టికీ తెచ్చారు. సోనియా జోక్యం చేసుకుని రాహుల్, సీనియర్ల మధ్య పలుమార్లు రాజీ కుదిర్చారు. ఇప్పుడు రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత రాజీ రాజకీయానికి తావుండకపోవచ్చు.
*
చిత్రం..కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పార్టీ ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేస్తున్న రాహుల్ గాంధీ

*
వారసుడొచ్చాడని సం
బరపడనేలనొ, పరీక్ష ఫలితము రానీ
పోరైతే ముందున్నది
పోరాట పటిమను తెలుపును పొంగో రంగో?!