జాతీయ వార్తలు

వేడెక్కనున్న ‘శీతాకాలం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న ఈ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు, విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పక్షం వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ముగ్గురు సభ్యుల మృతి కారణంగా లోక్‌సభ శుక్రవారం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండానే వాయిదా పడవచ్చు. రాజ్యసభ కొనసాగినా ప్రతిపక్షం సృష్టించే గొడవ మూలంగా వాయిదాపడే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు సోమవారం కూడా గొడవ చేసే సూచనలున్నందున ఉభయ సభలు మంగళవారం నుండి పనిచేయటం ప్రారంభించవచ్చు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి కలిగించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు, వెనుకబడిన కులాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు సంబంధించిన రెండు ప్రధాన బిల్లులు పార్లమెంటులో చర్చకు రానున్నాయి. వీటితోపాటు మరికొన్ని ముఖ్యమైన బిల్లులపై కూడా ఉభయ సభల్లో చర్చ జరుగనున్నది. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించే సూచనలు కనిపించటం లేదు. అనంత్‌కుమార్ నాయకత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ తయారు చేసిన బిల్లుల అజెండాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు ప్రస్తావన లేదు. ఇదిలాఉంటే శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మూడోరోజే అంటే 18వ తేదీన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆ ప్రభావం కూడా ఉభయ సభలపై పడుతుంది. బీజేపీ విజయం సాధించే పక్షంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డీలాపడడం ఖాయం. దీనికి బదులు బీజేపీ మట్టికరిచిన పక్షంలో రాహుల్‌కు రాజకీయంగా ఇక తిరుగుండదు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విడిగా జరిపిన వివిధ పార్టీల నాయకుల సమావేశంలోనూ ఇదే విజ్ఞప్తి చేశారు. చర్చలద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి తప్ప ఉభయ సభలను స్తంభింపజేయటం మంచిది కాదని నరేంద్ర మోదీ, సుమిత్రా మహాజన్ ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. అయితే పార్లమెంటు సజావుగా సాగే విషయంలో ప్రతిపక్షాల నుండి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. మోదీ ప్రభుత్వం తప్పిదాలను ప్రజల ముందు పెట్టేందుకు పార్లమెంటు ఉభయ సభల వేదికలను ఉపయోగించుకుంటామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశమై పార్లమెంటు ఉభయ సభల్లో అధికార పక్షాన్ని దెబ్బతీసేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చలు జరిపారు. ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఫ్లోర్ మేనేజ్‌మెంట్ చేసుకోవటం ద్వారా అధికార పక్షాన్ని దెబ్బతీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇదిలాఉంటే నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ సీనియర్ నాయకులు, సీనియర్ మంత్రుల సమావేశంలో ప్రతిపక్షం దాడిని- ముఖ్యంగా ఆరోపణలను తిప్పికొట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై సమాలోచనలు జరిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేశారన్న ఆరోపణతో ప్రతిపక్షాలు అధికారపక్షంపై దాడికి సిద్ధమవుతున్నాయి. నరేంద్ర మోదీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలన్నీ గుర్రుగా ఉన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందంటూ మోదీ చేసిన ఆరోపణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఇచ్చిన విందులో పాకిస్తాన్ మాజీ మంత్రులు, మాజీ అధికారులతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించారంటూ చేసిన ఆరోపణ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌పై మోదీ చేసిన ఆరోపణలు తదితర అంశాలపై ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉభయ సభలను స్తంభింపజేసే అవకాశాలున్నాయి. నరేంద్ర మోదీ నీచుడు అంటూ మణిశంకర్ అయ్యర్ చేసిన ఆరోపణ గురించి ప్రస్తావించటం ద్వారా కాంగ్రెస్ దాడిని తిప్పికొట్టేందుకు అధికార బీజేపీ సిద్ధమవుతోంది.
చిత్రం..గురువారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం దృశ్యం