జాతీయ వార్తలు

ఉభయ సభల్లో నినాదాల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు చేసిన నినాదాలతో శుక్రవారం కూడా రాజ్యసభ కార్యకలాపాలు కొనసాగలేదు. మన్మోహన్ సింగ్‌కు క్షమాపణలు చెప్పే అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య ఒక అంగీకారం కుదరనంత వరకు రాజ్యసభను వాయిదా వేయటం మంచిదని ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్షం మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చేంత వరకు సభను కొనసాగనివ్వవచ్చుకదా అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్‌గోయల్ ప్రతిపక్షాన్ని డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం అందుకు సమ్మతించలేదు. అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక అవగాహన కుదిరేంత వరకు సభను వాయిదా వేయాలని ఆజాద్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో వెంకయ్యనాయుడుకు రాజ్యసభను వచ్చే వారం బుధవారం ఉదయం పదకొండు గంటల వరకు వాయిదా వేయకతప్పలేదు. లోక్‌సభలో కూడా కాంగ్రెస్ సభ్యులు మాజీ ప్రధానికి మోదీ క్షమాపణలు చెప్పటం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసినా స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రతిపక్ష సభ్యులు ఎంత గొడవ చేసినా సభను వాయిదా వేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యులు దాదాపు ఒక గంటా పది నిమిషాల పాటు నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించి ఆ తరువాత వాకౌట్ చేశారు.
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు నిన్నటి మాదిరిగానే ఈరోజు కూడా నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలనే అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగేంత వరకు రాజ్యసభను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మీరు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఒకసారి మాత్రమే సమావేశమైందని ఆయన చెప్పారు. ఈ కమిటీ వెంటవెంటనే సమావేశమై ఇరుపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కృషి చేయాలనీ, అంతవరకు రాజ్యసభను వాయిదా వేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిష్టంభన తొలగేందుకు ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో సభ కొనసాగటంలో తప్పులేదు కదా? అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్‌గోయల్ సూచించారు. విజయ్‌గోయల్ సూచనను కాంగ్రెస్ తిరస్కరించింది. ఇరుపక్షాల మధ్య అవగాహన కుదిరేంత వరకు రాజ్యసభను వాయిదా వేయవలసిందేనని ఆజాద్ గట్టిగా డిమాండ్ చేశారు. దీనితో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను బుధవారం నాటికి వాయిదా వేశారు.
ఎంపీల వేతనాలు పెంచాలి
పార్లమెంటు సభ్యుల వేతనాలు పెంచాలని అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు నరేష్ అగర్వాల్ డిమాండ్ చేశారు. నరేష్ అగర్వాల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు సభ్యుల వేతనాలను ఎప్పటికప్పుడు పెంచవలసి ఉన్నది, అయితే ప్రభుత్వం మాత్రం పత్రికలలో ప్రతికూల ప్రచారం వస్తుందనే భయంతో ఎంపీల వేతనాలు పెంచటం లేదని నరేష్ అగర్వాల్ ఆరోపించారు. పార్లమెంటు సభ్యుల వేతనాలు క్యాబినెట్ కార్యదర్శి వేతనం కంటే ఒక్క రూపాయ అధికంగా ఉండాలని ఆయన సూచించారు. ఒక టీవీ యాంకర్ సంవత్సరానికి ఐదున్నర కోట్ల వేతనం తీసుకుంటున్నారంటూ ఎంపీల వేతనాలు పెంచితే వచ్చే నష్టమేమిటని నరేష్ అగర్వాల్ ప్రశ్నించారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు తాను కూడా ఈ దిశగా పనిచేశానని వెంకయ్యనాయుడు సూచించారు. సభ్యుడి అభిప్రాయాలను ఆర్థిక శాఖ మంత్రి, సభా నాయకుడు అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకురావటంతోపాటు సరైన సమయంలో ఈ అంశంపై చర్చకు అనుమతి ఇస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ వాకౌట్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ శాసన సభ ఎన్నికల ప్రచారం సంధర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్చకు అనుమతించనందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం కూడా లోక్‌సభ నుండి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు మొదట దాదాపు ఒక గంటా పది నిమిషాల పాటు పోడియం వద్ద నిలబడి ఎన్.డి.ఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండే పోడియం వద్ద నిలబడి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యులకు నచ్చజెప్పేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్రంగా కృషి చేశారు. ఎన్నికల్లో చెప్పిన మాటల గురించి లోక్‌సభలో ప్రశ్నించటం మంచిది కాదు, అందుకే మీకు అనుమతి ఇవ్వటం లేదని ఆమె స్పష్టం చేశారు. సుమిత్రా మహాజన్ కాంగ్రెస్ సభ్యుల నినాదాల గొడవ మధ్యలోనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ సభ్యుల గొడవ మూలంగా సభను వాయిదా వేసే ప్రసక్తే లేదని ఆమె పలుమార్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యులు జీరో అవర్‌లో కూడా పది నిమిషాల పాటు నినాదాలు ఇస్తూ గొడవ చేసిన అనంతరం సభ నుండి వాకౌట్ చేశారు. మన్మోహన్ సింగ్‌పై చేసిన తప్పుడు ఆరోపణల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు నిరసనగా సభ నుండి వాకౌట్ చేస్తున్నామని ప్రతిపక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
చిత్రాలు..మన్మోహన్‌సింగ్‌కు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్పీకర్ సుమిత్రా మహాజన్