జాతీయ వార్తలు

మళ్లీ తెగబడిన పాక్ సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, డిసెంబర్ 23: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా కెరి సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులపై పాక్ బలగాలు శనివారం కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఈ కాల్పుల్లో మరొకరు గాయపడినట్టు భారత సైనికదళం అధికారి ధ్రువీకరించారు. పాక్ సైనికులు అకస్మాత్తుగా దాడి చేయడంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రాజౌరి జిల్లా పర్యటనలో ఉండగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైనికులు కాల్పులు జరిపారు. కెరి సెక్టార్‌లోని బ్రాత్ గల్లా వద్ద భారత సైనిక స్థావరంపై ఈ దాడి జరిగిందని రక్షణశాఖ అధికార ప్రతినిధి వివరించారు. కాల్పుల్లో గాయపడిన మేజర్ మొహార్కర్ ప్రఫుల్ల అంబదాస్, లేన్స్‌నాయక్ గుర్మైల్ సింగ్, సిపాయి పర్గట్ సింగ్ వీరమరణం చెందారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరికి వైద్యచికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఆర్మీకి చెందిన నలుగురు మరణించినట్లు రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాల్పుల అనంతరం భారత సైనికులు శత్రు సైనికులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. మృతులకు జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. పాకిస్తాన్ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడినా మన సైనికులు గట్టిగా తిప్పికొడతారని ఆయన అన్నారు.
కాల్పుల్లో మరణించిన మేజర్ అంబదాస్ (32) మహారాష్టల్రోని భండారా జిల్లా వాసి. ఇతనికి భార్య అవోలి ఉన్నారు. లేన్స్ నాయక్ గుర్మైల్ సింగ్ (34) పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాకు చెందినవాడు. ఇతనికి భార్య కుల్జీత్ కౌర్, ఓ కుమార్తె ఉన్నారు. సిపాయి పర్గట్ సింగ్ (30) హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందినవాడు. ఇతనికి భార్య రమణ్‌ప్రీత్ కౌర్, ఓ కుమారుడు ఉన్నారు. పాక్ కాల్పుల్లో మరణించిన వీరు అత్యంత ధైర్యసాహసాలున్నవారని, వారి త్యాగాలను భారతజాతి ఎప్పటికీ మరచిపోదని ఆర్మీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పాక్ ఓ ఉగ్రవాద దేశమని, యావత్ ప్రపంచం ఈ దేశాన్ని బహిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అన్నారు.