జాతీయ వార్తలు

పళనికి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 24: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కె నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం అధికార అన్నాడిఎంకెకు ఆశనిపాతంలా పరిణమించింది. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అన్నాడిఎంకె బహిష్కృత నాయకుడు టిటివి దినకరన్ తన సమీప ప్రత్యర్థిగా దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. దినకరన్ విజయం ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వంలోని అధికార అన్నాడిఎంకేకు దిగ్బ్రాంతికరమేనని విశే్లషకులు భావిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ మేనల్లుడు దినకరన్ అధికార అన్నాడిఎంకె అభ్యర్థి వి మధుసూదనన్‌పై 40,707 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. గత ఏడాది ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో జయలలితకు వచ్చిన ఓట్లకంటే కూడా అధిక మెజార్టీనే దినకరన్ సాధించడం గమనార్హం. ఆ ఎన్నికలో జయలలితకు తమ సమీప ప్రత్యర్థిపై 39,495 ఓట్లు అధికంగా లభించాయి. గత ఏడాది డిసెంబర్ 5న జయలలిత మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరపాల్సి వచ్చింది. ఈనెల 21న జరిగిన ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం నిర్వహించారు. అన్నాడిఎంకె అధికార గుర్తు అయిన రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ తమకే కేటాయించడం, పైగా అధికారంలో తామే ఉండటంతో పళనిస్వామి వర్గం తమదే విజయమన్న ధీమాతో చివరి క్షణం వరకూ ఉంది. జయలలిత మరిణానంతరం నిజమైన అన్నాడిఎంకె పళనిస్వామి వర్గానిదా? లేక శశికళదా? అన్న ఉత్కంఠ నేపథ్యంలో జరిగిన ఎన్నిక అధికార పార్టీకి అగ్నిపరీక్షగానే మారింది. 40వేల ఓట్లకు పైగా ఆధిక్యతతో శశికళ విధేయుడైన దినకరన్ తన ప్రెషర్ కుక్కర్ చిహ్నంతో విజయం సాధించడం అన్నది అధికార కూటమిలో అలజడిని రేకెత్తించింది. ఈ వైఫల్యానికి కారణాలను విశే్లషించేందుకు పళనిస్వామి వర్గం కీలక భేటీ నిర్వహించబోతోంది. కాగా జయలలిత మద్దతుదారుల విధేయత తనదేనని విజయోత్సాహ ఉపన్యాసంలో దినకరన్ పేర్కొన్నారు. తమదే నిజమైన అన్నాడిఎంకె అని, అమ్మ వారసుడినే ఆర్‌కె నగర్ ప్రజలు ఎన్నుకున్నారని స్పష్టం చేశారు. తనకు లభించిన ఆధిక్యతను బట్టిచూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం స్పష్టమవుతోందంటూ ముఖ్యమంత్రి పళనిస్వామిపై
పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాము ఇటీవల పర్యటించిన అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. కోటి 50లక్షల మంది పార్టీ కార్యకర్తలు తనకిచ్చిన భారీ బహుమతిగా ఈ విజయాన్ని అభివర్ణించారు. తమదే అసలైన అన్నాడిఎంకె అని పేర్కొన్న ఆయన, అధికార పార్టీ గుర్తు ఎంజిఆర్, జయలలిత పార్టీకి ఉంటేనే ప్రజలు దాన్ని గెలిపిస్తారే తప్ప ఇతరులు ఎవ్వరు దీన్ని సొంతం చేసుకున్నా వారికి పరాజయమేనన్న విషయం ఆర్‌కె నగర్ ఉప ఎన్నిక ఫలితంతో స్పష్టమైందన్నారు. రెండాకుల గుర్తు కోసం చివరి క్షణం వరకూ ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించిన దినకరన్, స్వతంత్ర అభ్యర్థిగా ప్రెషర్‌కుక్కర్ చిహ్నంపై పోటీ చేశారు. మొత్తం పోలైన 1,76,890 ఓట్లలో దినకరన్‌కు 50 శాతానికి పైగా ఓట్లు లభించాయి. మొదట్లో శశికళ వర్గంలోనే ఉన్న మధుసూదనన్ అనంతరం డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరంలో చేరారు. ఆయనకు 48,306 ఓట్లు వచ్చాయి.
కాగా, డిఎంకె, దినకరన్‌ల మధ్య రహస్య ఒప్పందం కుదరడం వల్లే ఆర్‌కె నగర్ ఫలితం ఇలా వచ్చిందని పళనిస్వామి వర్గం ఆరోపించింది. ఈ ఆరోపణలను తిరస్కరించిన డిఎంకె ఆర్‌కె నగర్ ఎన్నిక ఫలితం డిఎంకె అభ్యర్థి ఓటమికంటే కూడా ఎన్నికల కమిషన్ ఓటమికి నిదర్శనమని పేర్కొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కారు నాజరాజన్‌కు 2,203 నోటా ఓట్లు పడ్డాయి. ఆయనకు కేవలం 1236 ఓట్లు మాత్రమే లభించాయి.

చిత్రం..విజయానందంతో జయలలిత సమాధి వద్ద మోకరిల్లిన దినకరన్
*
మాయాజాలము వీగెను
భయమే మటుమాయమయ్యె భ్రమలే తొలగెన్
జయలలిత వారసత్వము
నయముగ ఆర్కేనగరిని నిశ్చితమాయెన్
*