జాతీయ వార్తలు

రాహుల్ ‘ముందస్తు’ వ్యూహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ కర్నాటక తదితర రాష్ట్రాల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలకు అప్పుడే సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన రాహుల్ గాంధీ కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తాజా వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికలను 2019కి బదులు 2018లో నిర్వహించవచ్చునని రాహుల్ అనుమానిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు. భాజపాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే తగు ఏర్పాట్లు చేసుకోవటం మంచిదని రాహుల్ గాంధీ పార్టీవారికి స్పష్టం చేశారని తెలిసింది.
2018లో చత్తీస్‌గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, త్రిపుర శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలనుకుని మోదీ భావించిన పక్షంలో ఈ రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదే జరిగితే తగిన వ్యూహాన్ని ఇప్పటినుంచే అమలు చేయాలని రాహుల్ భావిస్తున్నట్లు ఏఐసీసీ నాయకుడొకరు తెలిపారు. 2018 ఎన్నికలకు ఒక కార్యాచరణ పథకాన్ని రాహుల్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని, దీనిపై మరింత చర్చ జరిపిన అనంతరం తుది కార్యచరణను ఆచరణలో పెడతారనే మాట వినిపిస్తోంది. కిందిస్థాయి నుండి పని చేసుకురావాలని, కార్యకర్తలు, నాయకులను మోహరించి ప్రజలను కలుసుకునే పని ప్రారంభించాలన్నది రాహుల్ ఆలోచన. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ఏర్పడుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని కార్యచరణ పథకాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఇంత వరకు వరుసగా మూడుసార్లు గెలిచింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలోని 29 సీట్లలో 26 చోట్ల, చత్తీస్‌గఢ్‌లోని 11 సీట్లలో 10 స్థానాలకు బీజేపీ గెలుచుకున్నది. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఈ సీట్లను నిలబెట్టుకోవటం చాలాకష్టం. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో కష్టపడి పని చేస్తే కాంగ్రెస్ సునాయసంగా అధికారంలోకి వస్తుందన్నది రాహుల్ ఆలోచన. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. మహారాష్టల్రో 48 సీట్లలో 41 స్థానాలను, యుపిలోని 80 సీట్లలో 71 స్థానాలను గెలుచుకున్నది. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పనిచేస్తే ఈ రెండు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చునని కాంగ్రెస్ అధ్యక్షుడు అంచనా వేస్తున్నారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి తాము పనిచేస్తే 15 లేదా 16 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని రాహుల్ అంచనా. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో బిజెపి ఇంకా ముందుకు వెళ్లే పరిస్థితిలో లేదు. ఈ రాష్ట్రాల్లో బిజెపి గత లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన సీట్లను తిరిగి దక్కించుకోవడం ప్రశ్నార్థకమే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మంచిరోజులు ఖాయమని రాహుల్ భావిస్తున్నారు. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో ఇప్పటి నుండే ప్రజా ఉద్యమాలు చేపట్టటం ద్వారా కాంగ్రెస్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తామని ఏఐసీసీ నాయకులు చెబుతున్నారు.
ఒక వైపు ప్రజా ఉద్యమాలను నిర్మించటం, మరోవైపు భావసారూప్యత గల పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం ద్వారా బీజేపీని దెబ్బ తీసేందుకు రాహుల్ సిద్ధమవుతున్నారని తెలిసింది. ప్రజా ఉద్యమాల నిర్మాణానికి కాంగ్రెస్ అధినాయకత్వం ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహిస్తోందని అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి ఆధారంగా ప్రజా ఉద్యమాల నిర్మాణం జరపాలన్నది రాహుల్ వ్యూహం. ఈ రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సంబంధిత పీసీసీ నాయకులు ఇప్పటికే నివేదికలను రాహుల్‌కు సమర్పించారని తెలిసింది.
పీసీసీలు పంపించిన నివేదికలకు అదనంగా ప్రైవేట్ సంస్థలతో సర్వేలు జరిపించి రెండు నివేదికల సారాంశాన్ని అధ్యయనం చేస్తారు. ఈ సర్వేల సిఫారసుల ఆధారంగా ప్రజా ఉద్యమాల నిర్మాణం జరుగుతుందని ఏఐసీసీ చెబుతోంది. త్వరలో జరిగే ఏఐసిసి సర్వసభ్య సమావేశంలో ఆమోదముద్ర వేశాక క్షేత్రస్థాయి కార్యచరణ అమలులోకి వస్తుందని కాంగ్రెస్ చెబుతోంది. అసెంబ్లీతోపాటు లోక్‌సభకు పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ఎంపికను వీలున్నంత త్వరగా పూర్తిచేసి వారిద్వారా క్షేత్రస్థాయిలో పని చేయిస్తారని అంటున్నారు.