జాతీయ వార్తలు

మలుపు తిప్పిన తీర్పులు (గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత న్యాయవ్యవస్థలో 2017 సంవత్సరం చిరకాలం గుర్తుండేలా కొన్ని కీలక తీర్పులు వెలువడ్డాయి. ముఖ్యమైన కొన్ని కేసులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రక తీర్పులు న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు దోహదపడ్డాయి. కొన్ని తీర్పులు కొందరికి మోదం కలిగించగా, న్యాయస్థానాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. ‘నిర్భయ’ కేసులో దోషులకు సుప్రీం కోర్టు మరణశిక్షను సమర్థించింది. ‘డేరాబాబా’గా ప్రసిద్ధుడైన గుర్మీత్ రామ్ రహీమ్‌కు సుప్రీం యావజ్జీవ జైలుశిక్షను విధించింది. టీనేజీ బాలిక ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నుపూర్ తల్వార్‌లను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వ్యక్తిగత గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ చారిత్రక తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.
ముంబయి పేలుళ్ల కేసు
1993 నాటి ముంబయి పేలుళ్ల కేసులో ‘టాడా’ ప్రత్యేక కోర్టు ఫిరోజ్ ఖాన్, తహీర్ మర్చంట్‌లకు మరణశిక్ష విధిస్తూ 2017 జూన్‌లో తీర్పు ప్రకటించింది. ఇదే కేసులో అబూ సలెం, కరీముల్లా ఖాన్‌లకు యావజ్జీవ కారాగార వాసాన్ని విధించింది. 1993 మార్చి 12న ముంబయి నగరంలో తీవ్రవాదులు 13 చోట్ల బాంబులను పేల్చడంతో 257 మంది మరణించగా సుమారు 700 మంది క్షతగాత్రులయ్యారు.

‘నిర్భయ’ కేసు
దేశ రాజధాని ఢిల్లీలో 2012 నాటి ‘నిర్భయ’ సామూహిక అత్యాచారం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తూ నలుగురు నిందితులకు మరణశిక్షను ఖరారు చేసింది. 23 ఏళ్ల వైద్య విద్యార్థిని జ్యోతిసింగ్‌పై నడుస్తున్న బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడైన ఓ బాలనేరస్థుడు జువైనల్ హోమ్‌లో శిక్ష ముగిశాక బయటపడ్డాడు.

కొలిక్కివచ్చిన ఆరుషి కేసు
ఢిల్లీ సమీపంలోని నోయిడాలో 14 ఏళ్ల బాలిక హత్యకేసులో నిందితులైన ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నుపూర్ దంపతులను నిర్దోషులుగా నిర్థారిస్తూ అలహాబాద్ హైకోర్టు అక్టోబర్ 13న తీర్పు ఇచ్చింది. 2008లో ఆరుషిని ఆమె తల్లిదండ్రులే హతమార్చారన్నది ప్రాసిక్యూషన్ అభియోగం. ఆరుషి హత్య తర్వాత రాజేశ్ ఇంట్లో పనివాడు హేమరాజ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

2జీలో అందరూ నిర్దోషులే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులందరూ నిర్దోషులుగా బయటపడడం మరింత సంచలనాన్ని రేకెత్తించింది. ఏళ్ల తరబడి సిబిఐ జరిపిన దర్యాప్తులో నిందితులెవరిపైనా దోషిత్వ నిర్థారణ యోగ్యమైన సాక్ష్యాలేవీ లేకపోవడంతో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డిఎంకె ఎంపీ కనిమొళితో పాటు మొత్తం 19 మందిని నిర్దోషులుగా తేల్చింది. 2011లో ఈ కేసులో రాజా, కనిమొళి తదితరులను అరెస్టు చేశారు. వారు ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. 2జీ కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సిబిఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

డేరాబాబాకు జైలు
హర్యానాలోని ‘రామ్హ్రీమ్ డేరా స్వచ్ఛ సౌధ’ అధిపతి గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు అత్యాచార అభియోగాలపై న్యాయస్థానం ఇరవై ఏళ్ల జైలుశిక్షను విధించింది. తనపై అత్యాచారం జరిగిందని 2002లో ఓ మహిళ అప్పటి ప్రధాని వాజపేయికి రాసిన లేఖలో ఫిర్యాదు చేసింది. డేరా ఆశ్రమంలో అత్యాచారాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. డేరాబాబాను అరెస్టు చేసినపుడు ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లో చెలరేగిన అల్లర్లలో 30 మంది ప్రాణాలు కొల్పోగా, 250 మంది గాయపడ్డారు.

గోప్యత ప్రాథమిక హక్కే..
‘ఆధార్’లో విధిగా నమోదు కావాలంటూ కేంద్రం జారీచేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు పిటిషనర్లు సుప్రీం కోర్టుకు వెళ్లగా, వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని తీర్పు ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానంలోని తొమ్మిది మంది సభ్యులున్న ధర్మాసనం ఈ మేరకు చారిత్రక తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణలో ఇది అంతర్గత భాగమని సుప్రీం స్పష్టం చేసింది.
తలాక్ రాజ్యాంగ విరుద్ధం
ముస్లిం మహిళల పాలిట శాపంగా మారిన తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం ఈ ఏడాది వెలువడిన తీర్పుల్లో చారిత్రకమైనది. అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం మెజారిటీ తీర్పులో ఈ కీలక రూలింగ్ వెలువరించడం భిన్నస్వరాలకు దారితీసింది. పార్లమెంటులో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆరు నెలల వ్యవధిలోనే తలాక్‌ను నిషేధిస్తూ పార్లమెంటులో ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తక్షణ విడాకులకు దారితీసే తలాక్ వల్ల ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని సుప్రీం కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించడమే గాకుండా, తలాక్ వల్ల వైవాహిక బంధాన్ని కాపాడుకునే అవకాశాలు మృగ్యమైపోతున్నాయని తెలిపింది.