జాతీయ వార్తలు

సిఫార్సులతో కాదు.. పనినిబట్టే ‘పద్మాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: తమ ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తోందని, ఎలాంటి ప్రచారానికి నోచుకోని సామాన్యులకు ఈ అవార్డులను ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సిఫార్సుల ప్రాతిపదికపై కాకుండా, వ్యక్తుల సేవలను గుర్తించి ‘పద్మ’ అవార్డులను అందజేస్తున్నామన్నారు. నూతన సంవత్సరంలో తన తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన దేశ ప్రజలనుద్దేశించి ఈ మాటలన్నారు. పెద్ద పెద్ద నగరాల్లో నివసించని వారిని, మీడియాలో ఎలాంటి ప్రచారం లేనివారిని గుర్తించి అత్యంత పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరుగుతోందన్నారు. ‘సిఫార్సులు కాదు, చేసిన పనిని బట్టే అవార్డులు ఇవ్వాలన్న’ది తమ ప్రభుత్వ విధానమన్నారు. ‘ఆకాశవాణి’ ద్వారా నిర్వహించే ‘మన్ కీ బాత్’లో మోదీ ఈసారి ‘పద్మ’ పురస్కార గ్రహీతల గురించి ప్రధానంగా మాట్లాడారు.
తాజాగా ‘పద్మ’ అవార్డులకు ఎంపికైన వారి పేర్లను పరిశీలిస్తే- సమాజంలో ఇలాంటి మహనీయులున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వపడతారని, సిఫార్సులకు అవార్డులు దక్కవన్న విషయం కూడా అవగతమవుతుందన్నారు. ‘గుర్తింపు కలిగి ఉండడం’ అన్నది అవార్డుకు అర్హత కాదని, విభిన్న రంగాల్లో చేసిన కృషి మేరకే పురస్కారాలు వరిస్తాయన్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మ’ అవార్డులకు ఎంపికైన వారిలో కొందరు చేసిన కృషిని ఆయన ప్రస్తావించారు. అవార్డు గ్రహీతలను పాఠశాలలకు, కళాశాలలకు ఆహ్వానిస్తే వారి అనుభవాలను విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. కేరళలో మూలికావైద్యాన్ని అందిస్తున్న గిరిజన మహిళ లక్ష్మీకుట్టి, వేలాదిమంది విద్యార్థులను శాస్ర్తియరంగంలో ప్రభావితం చేసిన కాన్పూరు ఐఐటి మాజీ అధ్యాపకుడు అరవింద్ గుప్తాలను ‘పద్మ’ అవార్డులకు ఎంపిక చేయడం సముచితంగా ఉందన్నారు. స్వార్థ రహితంగా పనిచేస్తున్న వారి నైపుణ్యాలను అవార్డులతో సంబంధం లేకుండా ప్రజలు కూడా గుర్తించాలన్నారు.
కాగా, ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు తొలిసారిగా పదిమంది ‘ఆసియాన్’ దేశాధినేతలు హాజరు కావడం అపూర్వ ఘట్టమని ప్రధాని అభివర్ణించారు. మహిళాశక్తిని కీర్తిస్తూ ఓ పౌరుడు తన ‘యాప్’కు పంపిన లేఖ గురించి మోదీ ప్రస్తావిస్తూ, దివంగత వ్యోమగామి కల్పనా చావ్లా నేటి యువతకు స్ఫూర్తిదాతగా నిలిచారని అన్నారు. మహిళాశక్తికి అవధులు లేవని కల్పనా చావ్లా గొప్ప సందేశం ఇచ్చారని, నేడు పలు రంగాల్లో మహిళలు ముందంజలో నడుస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని అన్నారు. ప్రాచీన భారతంలోనే మహిళలు సాధించిన విజయాలు అందరికీ విస్మయం కలిగిస్తాయని, ‘పదిమంది కుమారులతో ఒక కుమార్తె సమానమ’ని ఆయన ఓ శ్లోకాన్ని ఉదహరించారు. ఇటీవల సుఖోయ్-30 యుద్ధ విమానంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ప్రయాణించడం మహిళల ఘనతకు నిదర్శనమని మోదీ అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ప్రవేశించడమే కాదు, కొన్ని సందర్భాల్లో సారథ్యం వహిస్తున్నారని తెలిపారు. అసాధారణ ప్రతిభతో వివిధ రంగాల్లో ‘తొలి మహిళలు’గా గుర్తింపు పొందిన దాదాపు వందమంది మహిళలను రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సత్కరించడాన్ని మోదీ ప్రస్తావించారు. ‘తొలి మహిళలు’గా గుర్తింపు పొందిన వీరి జీవిత విశేషాలపై రూపొందించిన పుస్తకం తన వెబ్‌సైట్‌లో ఉందని, ఈ పుస్తకాన్ని చదివి మిగతావారంతా స్ఫూర్తి పొందాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలో చోటుచేసుకుంటున్న ఆశావహ మార్పుల్లో మహిళలకూ కీలకపాత్ర ఉందన్నారు. గణతంత్ర వేడుకల్లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన మహిళా బైకర్లు చేసిన సాహస కృత్యాలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయని అన్నారు. శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొంటున్న చత్తీస్‌గఢ్‌లో ‘ఈ-రిక్షాల’ను నడుపుతున్న మహిళలు అక్కడి పరిస్థితుల్లో మార్పుకు నాంది పలికారని మోదీ ప్రశంసించారు. ముంబయిలోని మాతుంగ రైల్వే స్టేషన్‌లో ఉద్యోగులందరూ మహిళలే కావడం గర్వకారణమన్నారు. ఆత్మపరిశీలన చేసుకుంటూ సవాళ్లను అధిగమించడం భారతీయ నాగరికత అన్నారు. వరకట్నం, బాల్య వివాహాలపై చైతన్యం కలిగించేందుకు గత ఏడాది బిహార్‌లో 13,000 కిలోమీటర్ల మేరకు ‘మానవహారం’ నిర్మించడం అద్భుత ఘట్టమని మోదీ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి (ఈ నెల 30) సందర్భంగా శాంతి, అహింస విధానాలకు జాతి పునరంకితం కావాలన్నారు. ప్రజారోగ్యం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జన ఔషధి కేంద్రాల’ ద్వారా మార్కెట్ రేట్ల కంటే 50 నుంచి 90 శాతం తక్కువ ధరలకు మందులు పొందే అవకాశం కల్పించామన్నారు. వివిధ దేశాల్లో చట్టసభలకు భారతీయులు ఎన్నిక కావడం గర్వించదగ్గ విషయమన్నారు.