జాతీయ వార్తలు

పేదలకు దూరం.. దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, జనవరి 31: నరేంద్ర మోదీ ఇప్పటికీ ‘సూటు-బూటు ప్రధాని’ అని, పేదలకు దూరంగా ఉండేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తాను ఖరీదైన నలుపు జాకెట్‌ను ధరించడం పట్ల మేఘాలయ బీజేపీ విభాగం చేసిన వ్యాఖ్యలకు రాహుల్ తీవ్రంగా స్పందించారు. సూట్లు ధరించిన వారి మధ్య గడిపేందుకు మాత్రమే ఇష్టపడే మోదీ పేదల మధ్యకు వెళ్లేందుకు ఏమాత్రం సుముఖత చూపరని ఆయన ప్రతిదాడి చేశారు. ‘ఆయన పేదవాడిని ఆలింగనం చేసుకోవడం గానీ, పేదవాడితో ముచ్చడించడం గానీ, నిరుపేదల మధ్య గడపడం గానీ ఎవరైనా చూశారా? పేదలను ‘తగినంత’ దూరంలో ఉంచే ఆయన ఒబామా లాంటి వ్యక్తుల మధ్య ఉండేందుకు తెగ ఆరాటపడతారు’ అని మోదీని ఉద్దేశించి రాహుల్ మండిపడ్డారు. ‘సూటు- బూటుపై మమకారం చూపే ప్రధాని దేశానికి ఏమీ చేయలేకపోతున్నారని, రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని వాగ్దానం చేసిన ఆయన తన లక్ష్యాన్ని సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. రాహుల్ చేసిన ‘సూటు- బూటు’ విమర్శలపై మేఘాలయ బీజేపీ విభాగం ఘాటైన సమాధానం ఇచ్చింది. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్ 63వేల రూపాయల విలువైన నలుపురంగు జాకెట్ వేసుకున్నారని బీజేపీ విమర్శించింది. రాహుల్ వేసుకున్న జాకెట్ గురించి మేఘాలయ బీజేపీ నేతలు ప్రస్తావిస్తూ, ‘సూటు-బూటు సర్కారు దేశంలో నల్లధనాన్ని అరికట్టింది, అవినీతిని పారదోలింది, కాంగ్రెస్ మాత్రం ఇక్కడి సమస్యలపై దృష్టి పెట్టడానికి బదులు తన అసమర్థతను చాటుకుంటోంది, మీరు చూపుతున్న అశ్రద్ధ ఇక్కడి వారిని అవహేళన చేసినట్టు ఉంది..’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, జాకెట్ వివాదంపై రాహుల్ స్పందిస్తూ, మేఘాలయకు చేరుకున్నపుడు దీన్ని తనకు కానుకగా ఇచ్చారని వివరించారు.
రాహుల్ గాంధీ మేఘాలయలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పలువురు క్రైస్తవ నాయకులను కలుసుకున్నారు. 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రంలో క్రైస్తవుల జనాభా గణనీయంగా ఉన్నందున ఆ సామాజికవర్గ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ రాష్ట్రంలో ఇటీవల క్రైస్తవ ప్రార్ధనామందిరాల నిర్మాణానికి కేంద్రం 70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. విభిన్న వర్గాల వారు నివసిస్తున్న భారత్‌లో అనేక దృష్టికోణాలుంటాయని, ఫలానా దృష్టికోణం సరైనది కాదని ఎవరూ బలవంతం చేయలేరని రాహుల్ వ్యాఖ్యానించారు.