జాతీయ వార్తలు

భగ్గుమన్న జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఫిబ్రవరి 10: పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అట్టుడికింది. శనివారం తెల్లవారుఝామున సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై విరుచుకుపడిన ఉగ్రవాదులు, ఇద్దరు సైనికుల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఘటనను అసెంబ్లీ తీవ్రంగా పరిగణించింది. ఘటనపై అత్యవసరంగా సమావేశమైన అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా సభ్యులు ఉగ్రవాద వ్యతిరేక నినాదాల చేశారు. ఉగ్రదాడిపై ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రణవీర్ రైనా సారథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు సీట్లవద్ద నిలబడి పెద్దపెట్టున పాక్ వ్యతిరేక నినాదాలిచ్చారు. ఎన్‌సి సభ్యుడు అలి మహ్మద్ సాగర్, సిపిఐ (ఎం) సభ్యుడు ఎంవై తరిగామి, కాంగ్రెస్ సభ్యుడు ఉస్మాన్ మజీద్‌లు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. సభ్యులంతా పాక్ వ్యతిరేక నినాదాల చేస్తున్న సమయంలో, ఎన్‌సి సభ్యుడు మహ్మద్ అక్బర్ లోన్ పాక్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దీంతో బీజేపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు లోన్ వైఖరిపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ కవిందర్ గుప్త జోక్యం చేసుకుంటూ ఇరుపక్షాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలతో ఎన్సీ సభ్యులు మరింత రెచ్చిపోయారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా స్పీకర్ వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దూషణలకు దిగడంతో, గందరగోళం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు స్పీకర్ కవిందర్ పావుగంట పాటు సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తరువాతా ప్రతిపక్ష సభ్యులు పెద్దపెట్టున నినాదాలిచ్చారు. స్పీకర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. సున్నితమైన అంశంపై సభా పరిణామాలు బయటకు వెళ్తే ప్రజల్లో అల్లర్లు చోటుచేసుకునే ప్రమాదం ఉందని సభ అభిప్రాయపడింది. అలాంటి వ్యాఖ్యలను ఉపసంహరించాలన్న సభ్యుల విజ్ఞప్తిని స్పీకర్ మన్నించి తొలగించారు. సున్నితమైన అంశాలపై సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం తగదంటూ మెజారిటీ సభ్యులు ఒక నిర్ణయానికి రావడంతో, వివాదం సద్దుమణిగింది.
ఆజ్యంపోసిన లోన్ వ్యాఖ్యలు
సభలో బీజేపీ ఎమ్మెల్యేలు పెద్దపెట్టున పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్న సమయంలో, ఎన్సీ సభ్యుడు మహ్మద్ అక్బర్ లోన్ పాక్ మద్దతు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. తొలుత బీజేపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఎన్సీ సభ్యులు జావెద్ రాణా, అలి మహ్మద్ సాగర్, అక్బర్ లోన్, అబ్దుల్ మజీద్ లర్మి పోడియం వద్ద నిరసనకు దిగారు. అదేసమయంలో పాక్‌కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినాదాల హోరు మరింత పెంచటంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన మహ్మద్ లోన్ పాక్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి స్పీకర్ కవిందర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం మీడియాతో మాట్లాడిన లోన్ ‘ఉగ్రదాడిని అడ్డం పెట్టుకుని ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం తట్టుకోలేకపోయాను. మా మనోభావాల దెబ్బతీయడం తగదు అని వ్యాఖ్యానించారు. ‘స్పీకర్ ప్రకటన చూస్తే, వాళ్ల మనసుల్లో ఏంవుందో అర్థమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అయితే లోన్ వ్యాఖ్యలను ఎన్సీ ఖండించింది. పార్టీ అధికార ప్రతినిధి జునైడ్ అజిమ్ మట్టు ఒక ట్వీట్ చేస్తూ ‘ఇప్పుడే పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా దృష్టికి తీసుకెళ్లాం. లోన్ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యమైనవి కావు’ అని పేర్కొన్నారు. ‘అతని వ్యాఖ్యలు పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. ఖండిస్తున్నాం కూడా’ అని ట్వీట్ చేశారు. కాశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న దురదృష్టకర పరిణామాలపైనే దృష్టిపెట్టామని, ఉగ్రదాడి ఎంతమాత్రం సమంజసం కాదని ఆ ట్వీట్‌లో పార్టీ అభిప్రాయాన్ని పేర్కొన్నారు.
చిత్రం..సంజ్‌వాన్ సైనిక స్థావరంపై మిలిటెంట్లు దాడి చేయడంతో అప్రమత్తమైన జవాన్లు