జాతీయ వార్తలు

రచ్చచేసి.. రెచ్చగొడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: ఎన్డీయే నుంచి తప్పుకోవాలన్న తెలుగుదేశం నిర్ణయం దురదృష్టకరం, ఏకపక్షమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా పేరిట ప్రజల మనోభావాలను రెచ్చగొట్టటం విచారకరమన్నారు. కేంద్రం పన్నులు, గ్రాంట్లు, ఇతర కేటాయింపుల రూపంలో ఏపీకి 2,44,271 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. కేంద్ర పన్నుల వాటా రూపంలో 1,70,686 కోట్లు, గ్రాంటు రూపంలో 36,225 కోట్లు, రెవెన్యూ లోటు కింద 22,113 కోట్లు ఇస్తోందన్నారు. స్థానిక సంస్థల గ్రాంట్లు 12,290 కోట్లు, ప్రకృతి వైపరీత్యాల సహాయం కింద 2,957 కోట్లు కేటాయిస్తోందన్నారు. ఏపీకి 2010-15 మధ్య 1,17,967 కోట్లు లభిస్తే తమ ప్రభుత్వం దీనికి అదనగా 1,26,304 కోట్లు ఇచ్చిందన్నారు. 107 శాతం అధిక నిధులు ఇవ్వటం అంటే బీజేపీ ప్రభుత్వానికి రాష్టంపట్ల చిత్తశుద్ధి లేనట్లా? అని నిలదీశారు. అమిత్ షా శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలోని వివరాలను శనివారం విడుదల చేశారు. ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా, చంద్రబాబుపై ఆరోపణలు కురిపించారు. ఎన్డీయే నుంచి తప్పుకోవాలన్న తెలుగుదేశం నిర్ణయం రాజకీయ కారణాలతో కూడుకున్నదే తప్ప రాష్ట్భ్రావృద్ధి కోసం కాదని దుయ్యబట్టారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేయని ప్రయత్నం లేదని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుండీ
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ కృషి చేస్తోందని, రాష్ట్ర విభజనను కాంగ్రెస్ గందరగోళంగా చేయటంతోపాటు తెలుగు ప్రజలను నట్టేట ముంచిందని ఆరోపించారు. విభజన మూలంగా నష్టపోయిన ఏపీని ఎన్నో రకాలుగా ఆదుకున్నామన్నారు. గత నాలుగేళ్లలో విభజన హామీలన్నీ దాదాపుగా పూర్తి చేశామన్నారు. ఏపీకి కేటాయింపులు అధికం చేయటంతోపాటు అదనంగా ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించామన్నారు. మీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రశంసించింది. అయితే రెండేళ్ల తర్వాత అకస్మాత్తుగా మాట మార్చి మరోసారి ప్రత్యేక హోదా కావాలంటుది. ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? అని నిలదీశారు. ప్రత్యేక ప్యాకేజీ కింద విదేశీ సహాయ పథకాల ద్వారా రూ.8,991 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ఆమోదించాం, 17,236 కోట్ల విలువ చేసే మరిన్ని ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి 2,500 కోట్లు ఇచ్చాం, పోలవరం ప్రాజెక్టుకు 5,364 కోట్లు విడుదల చేసినట్టు గుర్తు చేశారు. రాష్ట్రానికి పన్ను మినహాయింపులు ఇచ్చినా ఇవ్వలేదంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు ఆశలు, ఆకాంక్షలను బీజేపీ పట్టించుకోవటం లేదు, విభజన హామీలను అమలు చేయటం లేదు, రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదంటూ మీరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా సత్యదూరం, నిరాధారం అని అమిత్ షా లేఖలో పేర్కొన్నారు. సహకార ఫెడరలిజం మార్గదర్శకంగా ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇండియా భావనతో సీఎంలతో కలిసి పని చేస్తున్నారు. కేంద్ర ఆదాయం నుండి రాష్ట్రాలకు గతంలో 32 శాతం నిధులిస్తే, మోదీ ప్రభుత్వం 42 శాతం కేటాయిస్తోందన్నారు. ఏపీపట్ల ప్రత్యేక శ్రద్ధ, అభిమానాన్ని ప్రదర్శించి పెట్టుబడుల ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిందన్నారు. విభజన చట్టంలోని 14వ షెడ్యూలులో రెండు అంశాలున్నాయి. విద్య, వౌలిక సదుపాయాల కల్పన. 11 జాతీయ ప్రాధాన్యత గల విద్యా సంస్థలను 2022 ముగిసేలోగా ఏర్పాటు చేయాలని విభజన చట్టం సూచిస్తోంది. అయితే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ఐఐపీఈ, వ్యవసాయ వర్శిటీ, ఎయిమ్స్ వంటి ఆసుపత్రిని ఇదివరకే ఏర్పాటు చేశామని చంద్రబాబుకు రాసిన లేఖలో అమిత్ షా పేర్కొన్నారు. ఇక మిగిలిన రెండు సంస్థలు కేంద్రీయ వర్శిటీ, గిరిజన వర్శిటీ ఏర్పాటుకు ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించటం జరిగిందన్నారు. 2022 నాటికి ఏర్పాటు చేయవలసిన సంస్థలను ఇప్పుడే పూర్తి చేయటం అంటే ఏపీ ప్రజలపట్ల బీజేపీ చిత్తశుద్ధితో పని చేసినట్లు కాదా? అని అమిత్ షా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎనిమిది వౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టవలసి ఉండగా ఐదింటిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. కాకినాడలో హెచ్‌పీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, 800 కిలోమీటర్ల వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచే పని ప్రారంభమైంది.. రాపిడ్ రైల్, రోడ్డు పథకాల పని కూడా జరుగుతోందని అన్నారు. 24వేల కోట్లతో వీటి నిర్మాణం ప్రతిపాదించామన్నారు. అమరావతికి సంబంధించిన 180 కిలోమీటర్ల ఆవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని 19,700కోట్లతో చెపడుతున్నామన్నారు. అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని 2,680 కోట్లతో చేపట్టామన్నారు. 340కోట్ల వ్యయతో నడికుడి-శ్రీకాళహస్తి మధ్య 309 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. 8,631కోట్ల ఖర్చుతో గుంతకల్-గుంటూరు లైన్ డబ్లింగ్ చేపడుతున్నారని అమిత్ షా తెలిపారు. 6,769కోట్లతో చేపడుతున్న విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపామన్నారు. దుగిరాజపట్నం పోర్టు, ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని మొదట్లో నివేదికలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం దుగిరాజపట్నం లేదా మరో పోర్టును త్వరితగతిన అభివృద్ధి చేయాలనుకుంటోంది, ఉక్కు కార్మాగారం ఏర్పాటును పునఃపరిశీలించేందుకు ప్రత్యేక టాస్క్ పోర్సును ఏర్పాటు చేసిందని అమిత్ షా చెప్పారు. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశం రైల్వే శాఖ పరిశీలనలో ఉన్నదని ఆయన తెలిపారు.
ప్రత్యేక హోదా అంశం
కొన్ని పార్టీలు ప్రత్యేక హోదా అంశం ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టటం విచారకరమని ఆయన చెప్పారు. దీనిపై అర్థవంతమైన చర్చ జరగవలసి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాలకోసం హోదా పేరుతో ప్రజలను రెచ్చగొట్టటం భావ్యమా అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి అనుకూలంగా ఉండేందుకే 14వ ఆర్థిక సంఘం రిఫరెన్స్‌లను సవరించామన్నారు. దీని మూలంగానే బలహీనంగా ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు 14వ ఆర్థిక సంఘం ఐదు సంవత్సరాలకు గాను 22,113కోట్ల రెవెన్యూ లోటు భర్తీకి సిఫారసు చేసిందని అమిత్ షా చెప్పారు. మరే ఇతర రాష్ట్రానికి ఐదేళ్లపాటు లోటు భర్తీ సౌకర్యం కల్పించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నా మీరు మాత్రం రాజకీయ కారణాలకోసం విడిపోయారు, రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, బీజేపీకి కలిపి ఇచ్చిన తీర్పును మీరు రాజకీయ కారణాలకోసం దుర్వినియోగం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. ఇంత జరిగినా బీజేపీ మాత్రం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు పని చేస్తూనే ఉంటుందని అమిత్ షా ప్రకటించారు.