జాతీయ వార్తలు

మోదీ జోక్యంతో నకిలీ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బూటకపు వార్తలు రాసిన, ప్రసారం చేసిన పాత్రికేయుల అక్రిడిటేషన్లను దశలవారీగా రద్దు చేస్తూ సరికొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఆయన ఆదేశాల మేరకు బూటకపు వార్తలపై మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంగళవారం ప్రకటనలో పేర్కొంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పత్రికాస్వేచ్ఛను దెబ్బతీసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయంటూ జర్నలిస్టులు, రాజకీయ పక్షాలు పెద్దఎత్తున విమర్శలకు దిగాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ‘బూటకపు వార్తల మార్గదర్శకాలకు సంబంధించిన పత్రికా ప్రకటనను ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఉపసంహరించుకుంటున్నాం. ఈ విషయంపై ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన చేస్తుంది’ అని ప్రధానమంత్రి కార్యాలయ అధికారి ఒకరు ప్రకటించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని ప్రధాని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నకిలీ వార్తలు ప్రచురితమైనా, ప్రసారం చేసినా, అవి అబద్ధపు వార్తలని తేలితే వాటిని రాసిన జర్నలిస్టుల అక్రిడిటేషన్లను మొదటి ఉల్లంఘనకు ఆరునెలలు, రెండోసారి అలా చేస్తే
ఏడాదిపాటు, మూడోసారి కూడా అదే తప్పు చేస్తే శాశ్వతంగా రద్దు చేస్తామని పేర్కొంటూ నిన్నరాత్రి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివిధ రాజకీయ పక్షాలు, పత్రికారంగానికి చెందిన వివిధ సంస్థలు తీవ్రంగా స్పందించాయి. విమర్శల వర్షం కురిపించాయి. వంచనతో కూడిన నిబంధనలను తీసుకొచ్చి పాత్రికేయుల గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తున్న కేంద్రప్రభుత్వ నియంతృత్వ వైఖరి పతాకస్థాయికి చేరిందని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్‌డీఏ ప్రభుత్వ వైఖరి ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆప్, సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి. పత్రికారంగాన్ని నియంత్రించే హక్కు ప్రభుత్వానికి లేదని, నిజానికి నకిలీ వార్తల వ్యవహారంలో పత్రికారంగం ఆందోళన చెందుతోందని, ఈ వ్యవహారాన్ని కట్టడి చేయడానికి ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సరైన వేదిక అని, నకిలీ వార్తలపై ఈ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లహిర అన్నారు. ‘ప్రమాదకరమైన ఉద్దేశాలతో కూడిన ఈ ప్రకటన బోగస్. పత్రికారంగాన్ని ప్రభుత్వం నియంత్రించాలనుకుంటోంది. ఏది నిజమైన వార్తో, ఏది నకిలీ వార్దో ఎవరు నిర్ణయిస్తారు? సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ పని చేస్తుందా? అసలు ఎక్కువ అబద్ధపు వార్తలను ప్రభుత్వమే మీడియాలో ప్రచారం అయ్యేలా చేస్తుంది’ అని సీనియర్ జర్నలిస్ట్ హెచ్.కె.దువా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నకిలీ వార్తలపై వచ్చే ఫిర్యాదులను పత్రికలకు సంబంధించినవైతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, ప్రసారరంగానికి చెందినవైతే న్యూస్ బ్రాడకాస్టర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళతామని ఆ మార్గదర్శకాల్లో సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. ఆయా ఫిర్యాదులపై పదిహేను రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఒకసారి ఆయా వార్తలపై ఫిర్యాదు చేస్తే వెంటనే దానిని రాసిన లేదా ప్రసారం చేసిన జర్నలిస్టు అక్రిడిటేషన్ సస్పెన్షన్‌లోకి వెళుతుందని, తుది నిర్ణయం వచ్చాక సస్పెన్షన్ కొనసాగించేదీ, తొలగించేదీ తేలుతుందని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.