జాతీయ వార్తలు

దళిత వ్యతిరేకి మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రధాని నరేంద్రమోదీ విధానాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. ఆయన కులతత్వవాదిగా వ్యవహరిస్తున్నారని, దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అనుసరిస్తున్న అణచివేత సిద్ధాంతానికి వ్యతిరేకంగా తమ పార్టీ గట్టి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మతతత్వం, పార్లమెంట్ ప్రతిష్ఠంభనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా చేపట్టిన ఒక రోజు నిరసనకు రాజ్‌ఘాట్‌లో శ్రీకారం చుట్టిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో శతాధిక వత్సరాల కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించి అధికారాన్ని చేపడుతుందన్న ధీమాను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనడంలో ఎలాంటి రహస్యం లేదని ఈ వాస్తవం దేశ ప్రజలందరికీ తెలుసునన్నారు. దళితులు, గిరిజనులు మైనార్టీలకు చేటుచేసే సిద్ధాంతాన్ని బీజేపీ అనుసరిస్తోందన్నారు. ఈ పార్టీకి వ్యతిరేకంగా పోరాడతామని, 2019 ఎన్నికల్లో పరాజితం చేస్తామని రాహుల్ ఉద్ఘాటించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నాయకులు సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఉదయం పదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు జరిగిన నిరాహార దీక్షా కార్యక్రమానికి రాహుల్ గాంధీతోపాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సహా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీలోని సిక్కులపై జరిగిన దాడిలో
నిందితులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగదీష్ టైట్లర్, సజ్జన్‌కుమార్‌లను నిరాహార దీక్ష వేదికపై నుండి పంపించి వేశారు. ఇద్దరు నాయకులు నిరాహార దీక్ష వేదికపై ఉంటే కాంగ్రెస్‌కు చెడ్డపేరు వస్తుందనే భయంతోనే వారిని అక్కడి నుండి పంపించివేసినట్లు తెలిసింది. అయితే ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ మాత్రం ఈ వాదనను ఖండించారు. మాజీ ఎంపీలు ఎవ్వరూ వేదికపై కూర్చోకూడదనే నియమం మూలంగానే ఇద్దరు సీనియర్ నాయకులను అక్కడి నుండి పంపించివేసినట్లు ఆయన వివరించారు. మాజీ ఎంపీలు వేదిక కింద కార్యకర్తలతో పాటు కూర్చోవాలని పార్టీ ఇది వరకే నిర్ణయించినందుకే టైట్లర్, సజ్జన్‌కుమార్‌ను వేదిక పైనుండి పంపించవలసి వచ్చిందన్నారు.
ఇదిలాఉండగా జాతిపిత మహాత్మా గాంధీ సమాధి ముందున్న వి.ఐ.పి గేటు వద్ద కాంగ్రెస్ నాయకులు ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాహుల్ గాంధీ ఆదేశం మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాల వద్ద కాంగ్రెస్ నాయకులు దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని నిర్వీర్యం చేసినందుకు నిరసనగా ఏప్రిల్ రెండో తేదీన దళితులు, గిరిజనులు దేశ వ్యాపితంగా నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు దళితులు మరణించిన సంగతి తెలిసిందే. మతసామరస్యం కొరవడితే దేశానికి తీరని నష్టం వాటిల్లుతుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

చోలే భటూరే వివాదం
దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కాంగ్రెస్ అధినాయకత్వం రాజ్‌ఘాట్ వద్ద జరిపిన ఒక రోజు నిరాహార దీక్షా కార్యక్రమం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్ష సందర్భంగా ఛోలే భటూరే తిన్నారంటూ బీజేపీ ఫోటోలను విడుదల చేసింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజ్‌ఘాట్ వద్ద జరిపిన నిరాహార దీక్ష అసలు స్వరూపం ఇదంటూ బీజేపీ ఈ ఫొటో ట్వీట్లు చేసింది. దీనిని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. దళితులపై జరుగుతున్న దాడులను ఖండించేందుకు కాంగ్రెస్ నిరాహార దీక్ష జరిపిందని, ఇది పూర్తి స్థాయి నిరాహార దీక్ష కాదనేది గ్రహించాలని ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లలీ ఆనంద్ తెలిపారు. నిరాహార దీక్ష ప్రారంభానికి ముందు తీసిన ఫోటోలను బీజేపీ విడుదల చేసిందని ఆయన చెప్పారు.

చిత్రం..బీజేపీ పాలనా వైఖరిని నిరసిస్తూ రాజ్‌ఘాట్ వద్ద నేతలతో కలిసి నిరాహార దీక్ష నిర్వహించిన రాహుల్ గాంధీ