జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఉగ్రపంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 25: జమ్ముకాశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సుపై ముష్కరమూక విచక్షణా రహితంగా కురిపించిన తూటాల వర్షానికి ఎనిమిది మంది జవాన్లు వీరమరణం పొందారు. కనీసం 21మంది జవాన్లకు గాయాలయ్యాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌కు 14కిలోమీటర్ల దూరంలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. గత మూడు వారాల్లో భద్రతాదళాలను లక్ష్యం చేసుకుని టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో ఇది మూడోది. 2013 జూన్ 24న తొమ్మిది మంది జవాన్లను బలిగొన్న ఘటన తరువాత జరిగిన అతిపెద్ద కిరాతక ఘటన ఇదే. 161 బెటాలియన్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్ జవాన్లు శ్రీనగర్‌లో జరిగిన ఫైరింగ్ విన్యాసాల్లో పాల్గొని బస్సులో తిరిగి వెళ్తుండగా బస్సును లక్ష్యం చేసుకుని నలుగురు టెర్రరిస్టులు అత్యంత ఆధునిక రైఫిళ్లతో మూకుమ్మడిగా తూటాల వర్షం కురిపించారు. పాంపోర్ లోని అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మలుపు దగ్గర కారులో కాపు కాసిన ఉగ్రవాదులు, మలుపు సమీపంలో జవాన్ల బస్సు వేగం తగ్గించుకోవటంతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల కారణంగా బస్సు ఆగిపోవటంతో అందులోకి చొరబడటానికి ప్రయత్నించిన టెర్రరిస్టులపై సిఆర్‌పిఎఫ్‌కు చెందిన రోడ్ ఓపెనింగ్ పార్టీ టెర్రరిస్టులపై ఎదురుకాల్పులకు దిగగా ఇద్దరు అక్కడికక్కడే హతమయ్యారు. మరో ఇద్దరు కారులో శ్రీనగర్‌వైపు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే, పరారైన ఉగ్రవాదులకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ లేదు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో అయిదుగురు ఆసుపత్రికి రావటానికి ముందే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన 21మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఎదురుకాల్పులు పూర్తయిన తరువాత బస్సు వెనుక సీట్లలో మరో ముగ్గురి మృతదేహాలు లభ్యం కావటంతో చనిపోయిన జవాన్ల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. టెర్రరిస్టులు జాగ్రత్తగా రెక్కీ వేసి దాడికి తగిన ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు సీఆర్‌పిఎఫ్ ఐజి నళిన్ ప్రభాత్ అన్నారు. చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టుల మృతదేహాలను గమనించినప్పుడు వారు మానవబాంబులని తేలిందని పేర్కొన్నారు. ‘మేము ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఆ ఇద్దరూ పాక్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్నాం’ అని నళిన్ ప్రభాత్ తెలిపారు. ఆయన ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పరారైన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వీర జవానులకు జోహారులర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జూన్ 3, 4 తేదీలలో బిజ్‌బెహారా, శ్రీనగర్ జనరల్ బస్టాండ్‌లలో టెర్రరిస్టులు చేసిన దాడుల్లో ఇద్దరు జవాన్లు, ముగ్గురు పోలీసులు చనిపోయిన సంగతి తెలిసిందే.

చిత్రాలు దాడిలో గాయపడిన జవానులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్న సహచరులు.
ఉగ్రపంజా విసిరింది జవానులు ప్రయాణిస్తున్న ఈ బస్సుపైనే..