జాతీయ వార్తలు

15 రోజులు అక్కర్లేదు.. విశ్వాస తీర్మానంలో నెగ్గుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 17: అసెంబ్లీలో జరిగే బలనిరూపణలో విజయం సాధిస్తామని, విశ్వాస తీర్మానంలో నెగ్గుతామని కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీఎస్ యెడ్యూరప్ప ప్రకటించారు. ఉన్నతాధికారులతో తొలి సమావేశం నిర్వహించిన తర్వాత గురువారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగే విశ్వాస తీర్మానం పరీక్షలో బీజేపీ బలాన్ని నిరూపించుకుంటుందని, దీనిపై ఎటువంటి సంశయం లేదని, బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత అపవిత్ర కలయికతో తెరపైకి వచ్చి అధికారం కోసం వెంపర్లాడుతున్నాయన్నారు. వీలైనంత త్వరలోనే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటామన్నారు. 15 రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరంగా బలపరీక్షలో విజయం సాధిస్తామన్నారు. అంతరాత్మ ప్రబోధం మేరకు ఎమ్మెల్యేలు ఓటు వేయాలని ఆయన కోరారు. అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యేలకు ఆయన ఈ విషయమై విజ్ఞప్తిచేశారు. 1969లో రాష్టప్రతి ఎన్నికల సమయంలో కూడా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో రాష్టప్రతి పదవికి స్వతంత్ర అభ్యర్థి వివి గిరిని బలపరుస్తూ పై పిలుపు ఇచ్చారన్నారు. అసెంబ్లీలో జరిగే విశ్వాసపరీక్షలో తాను గెలిచి తీరుతానని, ఈ అంశంపై తనకు ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. ప్రజల మద్దతు పార్టీకి, తనకు ఉందన్నారు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో రైతాంగానికి ఊరట కలిగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి రూ.1 లక్ష వరకు రైతులు తీసుకున్నరుణాలను షరతులకు లోబడి మాఫీ చేసే విషయమై సమీక్షించి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
యెడ్డీ ఒకరోజు ముఖ్యమంత్రే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ఒకరోజు ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బీజేపీ శుక్రవారం తమకు మద్దతు ఇస్తున్న అభ్యర్థుల సంఖ్యను నిరూపించుకోవాల్సి ఉందని, అందులో ఆ పార్టీ ఘోరంగా విఫలం కానున్నందున యడ్యూరప్ప ఒకరోజులోనే తన పదవికి రాజీనామా చేయక తప్పదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ కర్నాటక గవర్నర్ వాజూభాయి వాలా రాజ్యాంగంపై రెండుసార్లు దాడి చేశారని, మెజారిటీ లేని బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించి మొదటి దాడి చేశారని, ముఖ్యమంత్రిగా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించి రెండో తప్పు చేశారని ఆయన ధ్వజమెత్తారు. కాగా, యడ్యూరప్పతో గురువారం గవర్నర్ చేయించే ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయించాలని కాంగ్రెస్, జేడీ(ఎస్) బుధవారం రాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్టే విధించడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు కేసును శుక్రవారం నాటికి వాయిదా వేసింది.
రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ వాజుభాయి వాలా నిర్ణయం తీసుకుని యడ్యూరప్పతో ప్రమాణస్వీకారం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలియజేస్తామని రణదీప్‌సింగ్ వెల్లడించారు. యడ్యూరప్ప ఒకరోజు ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని, అతని తలరాత కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు.
అధికారం చేపట్టడానికి అవసరమైన సభ్యుల సంఖ్య లేకుండా గవర్నర్ బీజేపీని ఎలా ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కిస్తారని ఆయన ప్రశ్నిస్తూ గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో గవర్నర్ నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు.
‘మీరు (మోదీ, షా) ముందుగా కర్నాటక అసెంబ్లీలో మీ మెజారిటీ నిరూపించుకోండి, మీకు ధైర్యం ఉంటే, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఏ విధమైన ప్రలోభాలకు పాల్పడకుండా మీ సంఖ్యాబలాన్ని చూపించండి’ అంటూ రణదీప్ సింగ్ సవాల్ విసిరారు. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కాంగ్రెస్, జెడి(ఎస్)ల వైఖరిపై ట్వీట్‌లో విరుచుకుపడ్డారు. అవకాశవాదంతో కాంగ్రెస్ పార్టీ జెడి(ఎస్)కు అధికారం అప్పగించడానికి నిర్ణయించుకుని చిల్లర రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు.

చిత్రం..ప్రమాణ స్వీకారం అనంతరం శివగంగ మఠానికి చెందిన శివకుమార స్వామి
ఆశీర్వాదాన్ని తీసుకుంటున్న కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప