జాతీయ వార్తలు

బీజేపీ ఆగడాలకు సుప్రీం అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: సుప్రీంకోర్టు తీర్పు కర్నాటక గవర్నర్ ‘రాజ్యాంగానికి విరుద్ధంగా’ వ్యవహరిస్తున్నారన్న సత్యాన్ని బహిర్గతం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ ముందు నుంచీ గవర్నర్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్నదన్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భాజపా బుకాయించడమే కాకుండా, ఇప్పుడు ధనబలం, కండబలం ప్రయోగానికి సిద్ధమైందని ఆయన ఆరోపించారు.
అక్రమ పద్ధతుల ద్వారా ప్రజల తీర్పును అవహేళన చేయడానికి భాజపా ఎంతమాత్రం వెనుకాడటం లేదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు భాజపా ఆగడాలకు అడ్డుకట్ట వేసేదిగా ఉన్నదన్నారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 104 సీట్లు రాగా, మెజారిటీకి మరో 8మంది సభ్యుల మద్దతు అవసరం. కాగా కాంగ్రెస్, జేడీఎస్‌లు ఉమ్మడిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఇరు పార్టీలకు కలిపి 116 ఎమ్మెల్యేలున్నారు. కానీ గవర్నర్ వాజూభాయ్ వాలా అత్యధిక సీట్లు సాధించిన భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో గందరగోళం రేగింది.
సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: సింఘ్వీ
కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప శనివారమే బలపరీక్షను ఎదుర్కోవాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందిగా కాంగ్రెస్ అభివర్ణించింది. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల సమయాన్ని 24 గంటలకు తగ్గిస్తూ బలపరీక్షను ఎదుర్కోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ధర్మాసనం తీర్పు తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తీర్పును స్వాగతించారు. ఇది బీజేపీ చెంపపెట్టువంటిదని ఆయన అన్నారు. యెడ్యూరప్పకు గవర్నర్ వాజుభాయ్ వాలా ఇచ్చిన 15 రోజుల సమయాన్ని కోర్టు తోసిపుచ్చిందని ఆయన తెలిపారు. అలాగే రహస్య ఓటింగ్ జరపాలన్న బీజేపీ వాదనను బెంచ్ తోసిపుచ్చడం ప్రశంసనీయమని సింఘ్వీ స్పష్టం చేశారు. బలపరీక్ష సమయం పెంచాలంటూ ముకుల్ రొహత్గీ కోర్టులో పదేపదే అభ్యర్థించడం చూస్తుంటే బీజేపీ ఏ స్థాయిలో భయపడుతున్నదీ అర్థమవుతోందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బలపరీక్ష రహస్య ఓటింగ్ పద్ధతిలో జరపాలని కోరారని, ఇది సిగ్గుచేటని కాంగ్రెస్ విమర్శించింది.
తీర్పుతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ: రణదీప్
సుప్రీం తీర్పుతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని, రాజ్యాంగ విజయం లభించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జివాలా వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శాసనసభలో బలం నిరూపించుకోవడానికి బీజేపీకి గవర్నర్ 15రోజుల గడువు ఇవ్వగా, దానిని కాదని కేవలం ఒక్కరోజులోనే తన మెజారిటీ నిరూపించుకోవాలని సుప్రీం పేర్కొంటూ ఇచ్చిన ఆదేశాలపై ఆయన హర్షం వ్యక్తంచేస్తూ అప్రజాస్వామికమైన ఈ నిర్ణయంపై కోర్టు ప్రజాస్వామిక ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని అన్నారు.