జాతీయ వార్తలు

సహనమే భారత్ శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, జూన్ 7: భారత జాతీయవాదం సుసంపన్నమైనదని, మతం, ప్రాంతం ప్రాతిపదికన ద్వేషం, అసహనాన్ని రెచ్చగొట్టడం ద్వారా జాతీయ వాదానికి కొత్త నిర్వచనాలు ఇచ్చే విధానాన్ని ప్రజలు అంగీకరించరని భారత పూర్వ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారత్ శక్తి సహనంలో ఉందని, బహుళత్వాన్ని గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత జాతీయ వాదంలో విశ్వ సౌభ్రాతృత్వం దాగి ఉందని ఆయన అన్నారు. వసుధైక కుటుంబం అనే ఉత్తమమైన భావన మన సంస్కృతిలో ప్రాచీన కాలం నుంచి వస్తోందని ఆయన అన్నారు. భిన్న సంస్కృతులు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రైస్తవులతో కూడిన సంగమం భారత్ అని, ఈ గొప్ప శక్తి భారత్‌కు ప్రపంచ దేశాల్లో విశిష్ట స్థానం సంపాదించిందని ఆయన అన్నారు. గురువారం ఆయన ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శిక్షా వర్గ్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రణబ్ ముఖర్జీ నాగ్‌పూర్ ఆరెస్సెస్ సదస్సుకు హాజరు కావడంపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. చివరకు కుమార్తె శర్మిష్ట నుంచి కాంగ్రెస్ ఇతర పార్టీలు ప్రణబ్ నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ ఈ సమావేశంలో చేయనున్న ప్రసంగంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరికి తోచినట్లు వారు జాతీయవాదానికి నిర్వచనం ఇచ్చుకుంటూ వెళ్లి సమభావం, సహజీవనం, విశిష్ట సంస్కృతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించరాదని హెచ్చరించారు. 25 నిమిషాల సేపు ప్రసంగంలో ఆయన జాతి, జాతీయవాదం, దేశ భక్తి అంశాలపై ప్రసంగించారు. భారత జాతీయవాదం అంటే ఒక భాష లేదా ఒక మతం లేదా ఒక శత్రువుగా చూడరాదని, ఒక సజీవత్వంలో కూడిన విశ్వజననీయత అని ఆయన అన్నారు. ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజలు 122 భాషలు మాట్లాడుతున్నారు. 1600 లిపిలు ఉన్నాయి. ఎవరి సంప్రదాయాలు, సంస్కృతులు వారివి. అందరూ భారతీయత అనే ఛత్రం కింద శాంతియుతంగా నివసిస్తున్నారు. భారతీయులకు శత్రువులు లేరు ’ అని ఆయన అన్నారు. ప్రతి రోజూ హింసాత్మక సంఘటనలను మనం చూస్తున్నాం. అన్ని రకాల హింసను తీవ్రంగా ఖండించాలి. అమానవీయ ఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. భారత ఆత్మను గాయపరిచే ఘటనలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఆగ్రహం, హింస నుంచి శాంతి, సంతోషం, సామరస్యత అనే దారిలో పయనించాలన్నారు. భారత్‌కు వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉందని వౌర్యుల కాలంలో దేశం ఏకతాటిపైకి వచ్చిందని చెప్పారు. అనంతరం ముస్లిం రాజులు పాలించారని, ఆ తర్వాత బ్రిటీష్ వారు ఈ దేశానికి వచ్చారని ఆయన చెప్పారు. తన ప్రసంగంలో ఆయనన నెహ్ర, రబీంద్రనాథ్ టాకూర్, బాలగంగాధర్ తిలక్‌తో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని ప్రస్తావించారు. దేశంలోని సంస్థాలను భారత్‌లో విలీనం చేసిన గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్ అని ఆయన కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీకని, అసహనం, ద్వేషం జాతీయతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. మహాత్మాగాంధీ చెప్పినట్లుగా జాతీయవాదం ఏ ఒక్కరిది కాదని ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరాం హెగ్డేవార్ భారతమాతకు ముద్దు బిడ్డ (గేట్ సన్ ఆఫ్ మదర్ ఇండియా) అని పూర్వ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ హెగ్డేవార్ జన్మించిన ఇంటిని సందర్శించారు. అనంతరం అక్కడ పుస్తకంలో ఆయన పై వ్యాఖ్యలు రాశారు.

ప్రణబ్ హాజరుపై చర్చ అనవసరం: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
భారత పూర్వ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ సమావేశానికి హాజరు కావడంపై చర్చను ముగించాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన అధ్యక్షోపన్యాసం ఇస్తూ, ఆరెస్సెస్‌కు ఎవరూ బయటి వ్యక్తులు కారన్నారు. ప్రణబ్ ముఖర్జీ భావాలు ముఖర్జీకే ఉంటాయని, ఆరెస్సెస్ ఆలోచనలు ఆరెస్సెస్ వారికే ఉంటాయని ఆయన చెప్పారు. మొత్తం సమాజాన్ని ఒకే విధంగా చూస్తామని, వర్గాలవారీగా విడదీసి చూసే దృక్పథం ఆరెస్సెస్‌కు లేదన్నారు. ఎవరి ఆలోచనలు, అభిప్రాయాలు వారికి ఉంటాయని, కాని అందరూ భారత మాత ముద్దు బిడ్డలని ఆయన అన్నారు. ఆరెస్సెస్ ప్రముఖులను సమావేశాలకు ఆహ్వానిస్తుందని ఆయన చెప్పారు. ఈ సంప్రదాయం మొదటి నుంచి ఉందన్నారు. ఈ సమావేశానికి పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీ కుమారుడు సునీల్ శాస్ర్తీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బంధువు ఆర్రేంధు బోస్ తదితరులు హాజరయ్యారు.