జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్/ జమ్ము, జూన్ 16: పవిత్ర రంజాన్ రోజూ కాశ్మీర్‌లో అల్లర్లు ఆగలేదు. పుల్వామా జిల్లాలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో ఒక యువకుడు మృతిచెందాడు. అనంత్‌నాగ్ జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణల్లో గ్రనేడ్ పేలి మరో యువకుడు మృతి చెందాడు. ఇక రజౌరి జిల్లాలోని వాస్తవాధీన రేఖవద్ద కాల్పుల విమరణ ఉల్లంఘనకు పాల్పడిన పాక్ మిలట్రీ మూకల చేతిలో భారత్ జవాను బికాస్ గురుంగ్ కన్నుమూశాడు. రక్షణ దళాల అధికార ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం రంజాన్ ప్రార్థనల అనంతరం నౌపోరా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పెట్రోలింగ్‌లోవున్న ఆర్మీ వాహనాలను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా ఆందోళనకారులు నాలుగు వాహనాలను నిలిపారు. వాహనాలను తీయాలంటూ భద్రతా బలగాలు వారిస్తున్న సమయంలోనే అక్కడ గుమిగూడిన ఆందోళనకారులు భద్రతా బలగాలపైకి రాళ్లవర్షం కురిపించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వటంతో కాల్పులకు దిగక తప్పలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరుపక్షాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వకాస్ అహ్మద్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.
అనంత్‌నాగ్ జిల్లాలోని బార్క్‌పోర ప్రాంతంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో షెరాజ్ అహ్మద్ అనే యువకుడు మృతిచెందాడు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గ్రనేడ్ పేలుడు కారణంగా యువకుడు మృతిచెందినట్టు పోలీసులు నిర్థారించారు. అయితే, గ్రనేడ్‌ను విసిరింది పోలీసులా? ఆందోళనకారులా? అన్నది తెలియరాలేదు. ఇదికాకుండా కాశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో శనివారం భారీగానే అల్లర్లు చోటుచేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం అందుతోంది.
జవాను మృతి
సరిహద్దుల్లో పాక్ ఆర్మీ బలగాలు నిరంతరంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నాయి. గత జూన్ 13న సాంబ జిల్లాలోని వాస్తవాధీన రేఖవద్ద ఉల్లంఘనలకు పాల్పడి నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన ఘటన మరువకముందే శనివారం మరోసారి పాక్ మూకలు కాల్పుల మిరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. రజౌరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 21ఏళ్ల రైఫిల్‌మెన్ బికాస్ గురుంగ్ (కున్క కుఖి, మణిపూర్) తీవ్ర గాయాలపాలై మృతిచెందినట్టు ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. రంజాన్ మాసంలో కాల్పులు చేపట్టకూడదన్న నైతికత కూడా లేకుండా పాక్ బలగాలు భారత సరిహద్దుల్లోకి తుపాకులు ఎక్కుపెట్టడం దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనతో వాస్తవాధీన రేఖవద్ద పాక్ మిలట్రీతో స్వీట్లు పంచుకునే కార్యక్రమాన్ని భారత ఆర్మీ రద్దు చేసుకుంది.
మందుపాతర పేలి ముగ్గురు మహిళల మృతి
జమ్ము-కాశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో మందుపాతర పేలిక ఘటనలో ముగ్గురు మహిళలు మరణించగా, ఐదుగురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా సంచార తెగకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా పశువులు మేపుకునేందుకు కొండ ప్రాంతాలకు చేరుకుని అక్కడ టెంట్ వేసేందుకు ప్రయత్నించడంతో మందు పాతర పేలిందని పోలీసులు తెలిపారు. మరణించినవారిలో జీనమ్ (46), మార్యమ్ (27), జరీనా (22)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన పిల్లలందరూ ఆరేళ్ల లోపు వయస్సువారేనని వారికి చికిత్స జరుగుతోందని తెలిపారు.
చిత్రం..రంజాన్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం శ్రీనగర్‌లో భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్న అల్లరి మూకలు