జాతీయ వార్తలు

‘మత్తు’ వదిలిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: దేశ సరిహద్దుల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం పెనుసవాల్‌గా మారాయని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ హెచ్చరించారు. వీటినుంచి దేశాన్ని కాపాడుకోడానికి సరిహద్దును ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో మరింత అప్రమత్తతంగా ఉండాలని మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. పంజాబ్, మణిపూర్ సహా పలు సరిహద్దు రాష్ట్రాల్లో గస్తీ మరింత పెంచాలని ఆయన అన్నారు. మాదకద్రవ్యాల స్మగ్లింగ్, మనుషుల అక్రమ రవాణాతో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయని కోవింద్ చెప్పారు. ‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిపోవడం, మత్తుపదార్థాల వినియోగం ముప్పుగా పరిణమించాయి’ అని ఆయన పేర్కొన్నారు. పంజాబ్, మణిపూర్ వంటి రాష్ట్రాల సరిహద్దుల్లో గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. మద్యపానానికి వ్యతిరేకంగా పనిచేసిన సంస్థలకు ప్రకటించిన జాతీయ అవార్డులను రాష్టప్రతి ప్రదానం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మద్యపానం, మత్తుపదార్థాలు తీసుకోవడం వల్ల బంగారు భవిష్యత్ నాశనమవుతుందని కోవింద్ అన్నారు. మద్యానికి బానిసలుగా మారవద్దని ఆయన పిలుపునిచ్చారు. తాగుడుకు అలవాటుపడ్డ వ్యక్తితోపాటు, అతడి కుటుంబం చిన్నాభిన్నమవుతుందని తద్వారా సమాజంపైనా చెడు ప్రభావం పడుతుందని రాష్టప్రతి అన్నారు. మద్యపానం, మాదకద్రవాల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. ఆరోగ్యాలు పాడవడమే కాదు, సంస్కృతి, అభివృద్ధి చివరికి రాజకీయాలు కలుషితమవుతాయని కోవింద్ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వాడడం వల్ల సమాజం ముఖ్యంగా యువత తీవ్రంగా నష్టపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి పాఠశాలలకు పాకిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని తెలిపారు. దీని నుంచి ప్రజలను కాపాడ్డానికి వారిలో అవగాహన కల్పించాలని కోవింద్ పిలుపునిచ్చారు. బాధితులకు చేయూత నివ్వడం, పత్తుపదార్థాల జోలికి వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి, సంస్థలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా డ్రగ్స్ మహమ్మారిపై పోరాడాలని రాష్టప్రతి ఉద్ఘాటించారు. వైద్య, పునరావాస కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. దీనికోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వశాఖ చేపట్టిన చర్యలు గుర్తుచేశారు. మాదకద్రవ్యాలు, మద్యానికి బానిసలుగా మారినవారిని దాన్నుంచి బయటకు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ వెల్లడించారు. బాధితులు, వారి కుటుంబ సభ్యుల కోసం రేయింబవళ్లూ అందుబాటులో ఉండేలా 1800110031 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్టు గెహ్లాట్ చెప్పారు. స్వచ్చంద సంస్థలకు ఆన్‌లైన్ ద్వారా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రక్రియను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. బాధితుల కోసం సుమారు 400 పునరావాస కేంద్రాలు పనిచేస్తున్నాయని అన్నారు.
చిత్రం..మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం చెబుతున్న కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాట్