జాతీయ వార్తలు

ఒడిశాలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూలై 1: వచ్చే ఏడాది జరగనున్న ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఒడిశా అసెంబ్లీలో 147 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కనీసం 120 సీట్లలో విజయం సాధించాలని బీజేపి అగ్రనాయకత్వం పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో బీజేపి క్యాడర్, నేతల్లో ఉత్సాహం నింపేందుకు, పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం ఇక్కడకు చేరుకున్నారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చే దిశగా బీజేపి అడుగులు వేస్తోంది. ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టడంలో తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న అమిత్ షా ఈ సారి ఉత్కళ రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగరవేయాలని మార్గ నిర్దేశనం చేయనున్నారు. దీంతో జిల్లాల వారీగా, రాష్ట్ర స్థాయిలో కీలక నేతలతో సమావేశాలను నిర్వహించారు. ఒడిశా అసెంబ్లీకి లోక్‌సభతో పాటు ఎన్నికలు జరగనున్నాయి. జమిలి ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ఏడాది ముందుగానే ఒడిశాలో ఎన్నికల కోలాహలం నెలకొంది. బీజేపీని కింది స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు, అధికారాన్ని కైవశం చేసేందుకు జిల్లాలు, రాష్ట్ర స్థాయి సమస్యలను అధ్యయనం చేసి ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని అమిత్ షా ఆదేశించారు. ప్రస్తుతం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అధికారంలో 2000 సంవత్సరం నుంచి ఉంది. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై అవినీతి అభియోగాలు ఏమీలేవు. కాని ప్రజల్లో మాత్రం మార్పును కోరుకుంటున్నట్లు విశే్లషకులు అంటున్నారు. అనేక కారణాల వల్ల ఇక్కడ కాంగ్రెస్ బలహీనపడింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకుంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా అధికారంలోకి రావాలనే సంకల్పంతో కేడర్ పనిచేస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్ పాండే అన్నారు. అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి చాలా ముఖ్యమైనవని ఆయన చెప్పారు. కేంద్రం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రణాళిక ఖరారు చేశారన్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పంచాయితీ స్థాయి నుంచి నేతలతో మాట్లాడేందుకు వీలుగా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. భువనేశ్వర్, పూరి, కటక్ లోక్‌సభ నియోజకవర్గాల్లో 21 అసెంబ్లీలు ఉన్నాయి. ఇక్కడ బూత్‌ల వారీ పార్టీ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశామని బీజేపీ నేతలు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేడీ పార్టీ, విపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం అమలు చేయమని, రాష్ట్రం చేపట్టిన ఆరోగ్య బీమా పథకం వల్ల ఎక్కువ లబ్ధి కలుగుతుందంటూ, కేంద్రంస్కీంలో చేరేందుకు ఒడిశా సర్కార్ నిరాకరించింది. దీంతో రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీల మధ్య వివాదం ముదిరింది. ఈ ఏడాది మే 26వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ కటక్‌లో పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు విశేషస్పందన లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా శ్రమిస్తే ఒడిశానుబీజేపీ ఖాతాలో చేర్చుకునే విధంగా, గెలుపు ఖాయంగా సర్వ శక్తులు పణంగా పెట్టి పోరాడుతామని బీజేపీ స్థానిక నేతలంటున్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 21 లోక్‌సభ సీట్లలో ఒక సీటును మాత్రమే గెలుచుకుంది. మిగిలిన 20 సీట్లలో బీజేడీ విజయం సాధించింది. నవీన్‌పట్నాయక్ ప్రభుత్వం పట్ల విముఖత, మోదీ ప్రభావం, మార్పు కావాలనే పట్టుదల ఓటర్లలో పెరిగింది. ఈ మార్పును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపి కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు.

చిత్రం..ఆదివారం భువనేశ్వర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న స్థానిక నేతలు