జాతీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి వరుసగా రెండోసారి పట్టం కట్టనున్నారని, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. దేశంలో ముస్లింలతో కలుపుకుని 30 నుంచి 35 శాతం ఉన్న మైనార్టీ ఓటర్లు బీజేపీకే ఓటు వేస్తారని ఆయన చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు మహాకూటమిని ఏర్పాటు చేయాలని కలలు కంటున్నారని, ఈ ప్రయత్నాలకు ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. మైనార్టీల్లో అభద్రతా భావాన్ని పెంపొందించేందుకు విపక్షాలు చేస్తున్న కుయుక్తులను మైనార్టీలు నమ్మడం లేదన్నారు. బీజేపీ పట్ల విపక్షాలు విషం చిమ్ముతున్నాయని, కాని ప్రజలే వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తాపత్రయపడుతున్న పార్టీలను చిత్తుగా ఓడిస్తారన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతకలహాలు జరగలేదన్నారు. ఇంతకంటే నైతిక విజయం ఏముంటుందన్నారు. కాశ్మీర్ వెలుపల ఉగ్రవాదుల దాడులను అరికట్టామన్నారు. యుపీఏ సర్కార్ హయాంలో ఎన్నిసార్లు ఉగ్రవాదులు దాడులు జరిగాయో ప్రజలకు తెలుసన్నారు. దేశంలో అన్ని వర్గాలు సామరస్యంగా జీవిస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేక విపక్ష పార్టీలు అసూయపడుతున్నాయన్నారు. దీంతో ప్రజలను తప్పుదోవబట్టించేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. యుపీఏ సర్కార్‌లో 530 మంది అమాయక ముస్లింలను ఉగ్రవాదులుగా ముద్రవేసి జైలుకు పంపారన్నారు. బీజేపీ హయాంలో ఒక్కముస్లింను కూడా ఉగ్రవాదిగా ముద్రవేసి జైలుకు పంపామా అని ఆయన నిలదీశారు. తాము లౌకికవాదానికి ప్రతీక అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. ముస్లింలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ చూసిందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరబ్ దేశాలతో స్నేహ బంధం పటిష్టమైందన్నారు. ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకు అరబ్ దేశాల నుంచి అమెరికా వరకు అన్ని దేశాలతో మోదీ సర్కార్ సత్సంబంధాలను నెలకొల్పిందని ఆయన చెప్పారు.