జాతీయ వార్తలు

విపక్ష అభ్యర్థిగా వందనా చవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ప్రతిపక్షం అభ్యర్థిగా ఎన్‌సీపీ నాయకురాలు వందనా చవాన్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలిసింది. ఎన్‌డీఏ తరపున జేడీ(యూ) సీనియర్ నాయకుడు హరివంశ్ నారాయణ్ సింగ్‌ను రంగంలో ఉండటం తెలిసిందే. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగే ఎన్నికకోసం బుధవారం మధ్యాహ్నం పనె్నండు గంటలలోగా నామినేషన్లు దాఖలు చేయవలసి ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వామపక్షాల అధినాయకులు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదితర ప్రతిపక్షం నాయకులు డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీచేసే అభ్యర్థి ఎంపికకోసం ఇప్పటికి పలుమార్లు చర్చలు జరిపారు. ఢిల్లీలో ఉన్నవారు ముఖాముఖీ చర్చలు జరిపితే రాష్ట్రాల్లో ఉన్న నాయకులతో ఫోన్లద్వారా సంప్రదింపులు కొనసాగించారు. రాజ్యసభలో యాభై మంది సభ్యులున్న కాంగ్రెస్ ప్రతిపక్షాల సమైక్యతకోసం తమ అభ్యర్థిని రంగంలోకి దించకుండా మిత్రపక్షాలు ఆమోదించే అభ్యర్థిని పోటీకి పెట్టాలని సూచించింది. దీంతో ఎన్‌సీపీ సభ్యురాలు వందనా చవాన్ పేరు తెర మీదికి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దించితే తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ, తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వకపోవచ్చు. అందుకే కాంగ్రెస్‌కు బదులు ఎన్‌సీపీ నాయకురాలిని పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు. వందనా చవాన్ పేరును బీఎస్పీ సీనియర్ నాయకుడు సతీష్ చంద్ర ప్రతిపాదించగా టీఎంసీ నాయకుడు డెరిక్ ఓబ్రేన్ సమర్థించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ మద్దతు సంపాదించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీజేడీ కలిసివచ్చే పక్షంలో ప్రతిపక్షం అభ్యర్థిగా ఆ పార్టీకి చెందిన ప్రసన్న ఆచార్యను రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే బీజేడీ ప్రతిపక్షంతో కలిసి పని చేయటం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని కొందరు చెబుతున్నారు. బీజేడీ హరివంశ్‌కు మద్దతు ఇస్తుందని వారు వాదిస్తున్నారు. ఇదిలావుండగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్‌డిఏ అభ్యర్థి హరివంశ్ సునాయసంగా ఎన్నికవుతారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఎన్‌డీఏ మిత్రపక్షాలతోపాటు టీఆర్‌ఎస్, బీజేడీ పార్టీలు మద్దతు ఇస్తాయని వారు వాదిస్తున్నారు. తాము ఓటింగ్‌లో పాల్గొనకపోవచ్చునని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడొకరు తెలిపారు.