జాతీయ వార్తలు

దళితులకు న్యాయమేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం పార్లమెంట్ స్ట్రీట్‌లో మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌తో నిర్వహిస్తున్న ‘సింహగర్జన’ మహసభకు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని, బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళితులపై దాడులను నివారించేందుకు రాజీవ్ గాంధీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొస్తే, ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టాన్ని ఏ జడ్జి అయితే నిర్వీర్యం చేస్తూ తీర్పిచ్చారో ఆ జడ్జికి పదోన్నతి కల్పించారని మండిపడ్డారు. దళిత, గిరిజన సంఘాల ఉద్యమాలకు దిగివచ్చి మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టిందని చెప్పారు. ఈ చట్ట పరిరక్షణకు జరిగే ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దే దింపితే తప్ప దళిత, గిరిజనులు స్వేచ్చగా
తిరగలేరని రాహుల్ పేర్కొన్నారు.
మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చకపోతే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధంమేనని హెచ్చరించారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ తొమ్మిదో షెడ్యూల్‌లో చట్టాన్ని చేర్చాలి.. అప్పటివరకు చేసే ఉద్యమాలకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ కుట్ర చేసిందని, ఓవైపు దాడులను ప్రోత్సహిస్తూ, మరోవైపు దళితులకు రక్షణ లేకుండా చేయడం అన్యాయమని పేర్కొన్నారు. వి.హనుమంతరావు మాట్లాడుతూ దళిత హక్కుల కోసం అందరూ కలిసి ఇలాగే పోరాటాలు కొనసాగించాలని పిలుపిచ్చారు. ఈ సింహగర్జనలో దళిత నాయకులు జేబీ రాజు, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, కలిగి ప్రభాకర్, గురునాథం, సత్యం, బ్రహ్మయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఢిల్లీ పార్లమెంట్ వీధిలో నిర్వహించిన దళిత సింహగర్జనకు సంఘీభావం తెలుపుతున్న రాహుల్