జాతీయ వార్తలు

ఎస్సీ, ఎస్టీ చట్టానికి మరింత పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: షెడ్యూల్‌కులాలు, తెగలపై అత్యాచారాలు, దౌర్జన్యాల నిరోధక చట్టానికి సవరణలు తెస్తూ ఈ చట్టాన్ని బలోపేతం చేస్తూ నిర్దేశించిన సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ చట్టం కింద పోలీసులు కేసులను నమోదు చేసే అంశాలను సడలిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి, ఈ చట్టాలను కఠినతరం చేస్తే నిబంధనలను రాజ్యసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సవరణ బిల్లును లోక్‌సభ ఈ నెల 6 తేదీన ఆమోదించింది. ఈ కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్ లభించదు. ఈ కేసుల్లో నిందితులు నేరం చేశారా లేదా అనే అంశంపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టకుండా
అరెస్టు చేసేందుకు వీలుగా చట్టాన్ని రూపొందించారు. క్రిమినల్ కేసును నమోదు చేసేందుకు ఎటువంటి ప్రాథమిక దర్యాప్తు అవసరం ఉండదు ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని స్వాగతించారు. దళితులు, బీసీల సంక్షేమం పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమన్నారు. ఈ బిల్లులో ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేసే నిబంధనను చేర్చినట్లు ఆయన చెప్పారు. దళితుల హక్కుల పరిరక్షణకు ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. ఇంతవరకు దేశంలో 14 రాష్ట్రాలు 195 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశాయన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదు వచ్చిన వెంటనే రెండు నెలల్లోగా అభియోగపత్రాన్ని పోలీసులు కోర్టుకు సమర్పిస్తారన్నారు. అభియోగపత్రాన్ని దాఖలు చేసినప్పటి నుంచి రెండు నెలల్లోగా కేసు విచారణ పూర్తయ్యే విధంగా నిబంధనలను చేర్చినట్లు పేర్కొన్నారు. వత్తిళ్ల మధ్య ఈ బిల్లు తీసుకురాలేదని, నరేంద్రమోదీ పట్టుదల వల్ల ఎస్సీ, ఎస్టీ ప్రజల హక్కుల పరిరక్షణకు కొత్త చట్టం తెస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అబిర్ రంజన్ బిశ్వాస్ మాట్లాడుతూ, ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని, కాని కేంద్రం విపక్షాల వత్తిడి వల్లనే బిల్లు తెచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ఘటనల్లో 9 మంది మరణించారన్నారు. ఈ కేసుల్లో శిక్ష రేట్లు 1.4 శాతం మాత్రమేనన్నారు. బీజేడీ సభ్యుడు సరోజిని హేమంబ్రం మాట్లాడుతూ, ఈ బిల్లుద్వారా సామాజిక న్యాయం అందుబాటులోకి వస్తుందన్నారు. జేడీయూ ఎంపీ రాంచంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ, డీఎస్పీ స్థాయికి తగ్గకుండా పోలీసు అధికారి ఈ కేసులను దర్యాప్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ కె కేశవరావు మాట్లాడుతూ ఈ చట్టాన్ని కూడా కోర్టులో సవాలు చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ అంశంపై సీపీఎం ఎంపీ సోమ్ ప్రసాద్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, బీఎస్పీ ఎంపీ రాజారాం, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, సీపీఐ ఎంపీ డీ రాజా, కాంగ్రెస్ ఎంపీ వాంసుక్ సియామ్, వైకాపా ఎంపీ వి విజయసాయిరెడ్డి ప్రసంగించారు.

చిత్రం..కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాట్