జాతీయ వార్తలు

ఆర్టికల్ 35ఏ సమస్యే కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఆర్టికల్ 35ఏ ఉన్నా, లేకున్నా జమ్మూకాశ్మీర్‌కు భారత్‌కు మధ్య ఎలాంటి సమస్య ఉండదు. ఆర్టికల్ 35ఏ అనేది పెద్ద సమస్య కాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి, జమ్మూకాశ్మీర్ వ్యవహారాల ఇంచార్జ్ రామ్‌మాధవ్ స్పష్టం చేశారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి సంఖ్యను పది లక్షలకు పెంచాలన్నది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. మంథన్ మ్యాగజైన్ జమ్ముకాశ్మీర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన హిందీ, ఇంగ్లీష్ సంచికలను రామ్‌మాధవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, 35ఏ ఆర్టికల్ ఉన్నా లేకపోయినా జమ్మూకాశ్మీర్‌ను దేశం నుండి విడదీయటం ఎవ్వరికి సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజ్యాంగం అత్యంత ప్రధానమైందే అయితే రాజ్యాంగం కంటే మన దేశ చరిత్ర, సంప్రదాయం అత్యంత ముఖ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మహాఋషి కష్యపుడి నుండి కల్హణుడి వరకు, కంబోజుడి నుండి సిక్కు మహరాజ్ రంజీత్‌సింగ్ వరకు అందరికీ కాశ్మీర్‌తో సంబంధం ఉండేదని రామ్‌మాధవ్ తెలిపారు. మన రాజ్యాంగం డెబ్బై సంవత్సరాల క్రితం వచ్చింది కానీ జమ్మూకాశ్మీర్‌కు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదనేది మరిచిపోరాదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రాధాన్యత రాజ్యాంగానికి ఉంటుంది, జమ్ముకాశ్మీర్ చరిత్రను కూడా మరిచిపోలేము కదా.. అని రామ్‌మాధవ్ అన్నారు. జమ్ముకాశ్మీర్‌లోకి ఇస్లాం వచ్చి ఐదారు వందల సంవత్సరాలైతే తీవ్రవాదం కేవలం ముప్పై ఏళ్ల క్రితమే వచ్చింది. కానీ రాష్ట్రానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్నదనేది ఎలా మరిచిపోతామని రామ్‌మాధవ్ ప్రశ్నించారు. జమ్ముకాశ్మీర్ చారిత్రికంగా, సాంస్కృతికంగా, మత పరంగా వేలాది సంవత్సరాల నుండి దేశంలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఉన్నది.. అయితే దీనికంటే మతం, సంస్కృతికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. మనవారు (బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్) వారు కూడా లక్ష తప్పులు చేసినా జమ్మూకాశ్మీర్ దేశం నుండి విడిపోదని రామ్‌మాధవ్ చెప్పారు. జమ్ముకాశ్మీర్ మనది అంటే కేవలం ఆ రాష్ట్ర భూమి కాదు.. భూమితోపాటు రాష్ట్ర ప్రజలు కూడా మనవారేనని ఆయన చెప్పారు. కొందరికి (ఇస్లామిక్ ఉగ్రవాదులు)లకు ఏవైనా భ్రమలుంటే వాటిని తొలగించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఆయన సూచించారు. జమ్మూకాశ్మీర్ ప్రయోజనాల పరిరక్షణ కోసమే మెహబూబా ముఫ్తి నాయకత్వంలోని పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని వివరణ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్ మనదైనప్పుడు, బీజేపీకి 20 మంది శాసనసభ్యులు గెలిచినప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకోసమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం.. ప్రయోజనాల పరిరక్షణ అసాధ్యమనిపించగానే ప్రభుత్వం నుండి తప్పుకున్నామని ఆయన తెలిపారు. గవర్నర్ హయాంలో రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత పెద్ద ఎత్తున జరుగుతోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇకమీదట బీజేపీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏ పార్టీకీ సాధ్యం కాదని అన్నారు. గత నాలుగేళ్లలో 36వేల కాశ్మీర్ పండిట్ల కుటుంబాలకు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. తాము ప్రభుత్వం నుండి తప్పుకున్నాం తప్ప జమ్మూకాశ్మీర్ నుండి కాదని రామ్‌మాధవ్ చెప్పారు. ఉగ్రవాదులు కూలగొట్టిన మఠాలు, దేవాలయాల పునరుద్ధరణ జరుగుతోందని ఆయన చెప్పారు. శ్రీనగర్‌లో పాకిస్తాన్ జెండా ఎగిరితే పెద్దఎత్తున వార్తలు రాసే మీడియా పీడీపీ, బీజేపీ హయాంలో ప్రతి జిల్లాలో 15 ఆగస్టుకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాం.. ఈ కార్యక్రమానికి నాలుగైదు వేల మంది హాజరయ్యేవారు.. దీనికి సంబంధించిన వార్తలు పత్రికల్లో రావని ఆయన బాధపడ్డారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి సంఖ్యను ఇప్పుడున్న రెండున్నర లక్షల నుండి పది లక్షలకు పెంచాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. గవర్నర్ పాలనలో ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయని అన్నారు.