జాతీయ వార్తలు

కుల్దీప్ నయ్యర్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రసిద్ధ జర్నలిస్టు, ఆంగ్లరచయిత కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. తుది శ్వాస విడిచే వరకు పత్రికాస్వేచ్ఛ, పౌర హక్కుల కోసం కులదీప్ నయ్యర్ పోరాడారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఇక్కడ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో మరణించారు. వయోభారం సమస్యలతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. గత కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న కులదీప్ నయ్యర్‌ను ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో
చేర్పించారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి కోసం పాటుపడిన కులదీప్ నయ్యర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక్కడ లోథీ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. 1923లో అవిభక్త భారతదేశంలో ప్రస్తుతం పాకిస్తాన్‌లోని సియాల్‌కోటలో జన్మించిన కులదీప్‌నయ్యర్ ఉర్దూ జర్నలిజంలో పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. ఆయన పనిచేయని పత్రిక లేదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, స్టేట్స్‌మ్యాన్ పత్రికల్లో ఎడిటర్‌గాపనిచేశారు. మానవ హక్కుల పరిరక్షణకు న్యాయవాదిగా కూడా ప్రాక్టీసు చేశారు. 1990లో ఇంగ్లాండ్‌లో భారత్ కార్యాలయానికి హైకమిషనర్‌గా పనిచేశారు. 1997లో రాజ్యసభకు నామినేటెడ్ సభ్యుల కోటాలో నియమితులయ్యారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ సమస్యలు, భారత్-పాక్ సంబంధాలపై రాసే కాలమ్స్ దాదాపు 50 ఆంగ్ల, ప్రాంతీయ పత్రికల్లో ప్రచురితమయ్యేవి. బియాండ్ ది లైన్స్, యాన్ ఆటోబయోగ్రఫీ, బిట్వీన్ ది లైన్స్ తదితర రచనలు చేశారు.
కులదీప్ నయ్యర్ మృతి పట్ల రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, స్పీకర్ సుమిత్రా మహజన్, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిజం రంగంలో కులదీప్ ధృవతార అని వారు ప్రశంసించారు. నైతికవిలువలకు కట్టుబడి పనిచేశారని వారు నివాళులు అర్పించారు. జర్నలిజం రంగంలో హిమశిఖర సమానుడు అని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం పోరాడే యోధుడు అని రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. నిర్భయంగా, సునిశితంగా విమర్శలు చేయడంలో కులదీప్ నయ్యర్ రాజీపడేవారు కారని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడారని ఆయన అన్నారు. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రగాఢ సంతాపం ప్రకటించింది. కులదీప్ నయ్యర్ ఒక రిపోర్టర్ ఎడిటర్ అని కొనియాడింది. పాత్రికేయవృత్తి విలువలను పరిరక్షించడానికి జీవితాంతం కృషి చేశారన్నారు. వీక్ మ్యాగజైన్ ఎడిటర్ సచిదానంద మూర్తి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రతిపాదించిన పరువునష్టం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించేందుకు చేసే ప్రయత్నాలను తిప్పిగొట్టడంలో కులదీప్ నయ్యర్ ముందుండి పోరాడేవారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

అంత్యక్రియలు పూర్తి
కుల్దీప్ నయ్యర్ భౌతికకాయానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గురువారం అంత్యక్రియలు జరిగాయి. లోధీ స్మశానవాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఫొటోగ్రాఫర్ రఘురాయ్, జతిన్‌దాస్ పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. అలాగే శిరోమణి అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర జాదవ్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పాల్గొన్నారు.

కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ రచయిత, జర్నలిస్టు, మాజీ పార్లమెంట్ సభ్యుడు కుల్దీప్ నయ్యర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన అంశాలపై ఆయన చేసిన అధ్యయనం, రచనలు భారత సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. శాంతి ఉద్యమకారుడిగా, మానవ హక్కుల ఉద్యమకారుడిగా కుల్దీప్ దేశ, విదేశాల్లో ఎంతో గుర్తింపు సాధించారని కొనియాడారు.