జాతీయ వార్తలు

తవ్వకాలవల్లే అపార నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 23: పశ్చిమ కనుమల రక్షణకు గాడ్గిల్ కమిటీ ఇచ్చిన నివేదిక సిఫార్సులను కనుక ప్రభుత్వం అమలుచేసి ఉంటే వానలు, వరదల వల్ల కేరళకు ఇంత పెనువిపత్తు సంభవించి ఉండేది కాదని ప్రముఖ పర్యావరణ వేత్త పేర్కొన్నారు. కేరళకు ఏర్పడిన అపార నష్టంపై స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు మాజీచైర్మన్ ప్రొఫెసర్ విఎస్ విజయన్ మాట్లాడుతూ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కనుమల ప్రాంతాల్లో విచ్చలవిడిగా గనుల తవ్వకాలు చేపట్టరాదని, కొండ ఏటవాలు ప్రాంతాల్లో వార్షిక పంటలను పండించడం మానాలని, పండ్లచెట్ల పెంపకాన్ని చేపట్టాలని తన నివేదికలో సిఫార్సు చేశారన్నారు. మానవుడు విచ్చలవిడిగా చేపట్టిన తవ్వకాలు మానాలని, అలాగే అక్కడ చేపట్టే ఇళ్లు, ఇతర నిర్మాణాలను ఆపివేయాలని సూచించారన్నారు. ఇప్పుడు కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలకు మనం పైన పేర్కొన్న విషయాలు పాటించకపోవడమే కారణమని అన్నారు. గాడ్గిల్ కమిటీ ఈ విషయంపై 2011లోనే తన సిఫార్సులను ప్రభుత్వానికి అందజేసిందని, ఒకవేళ వాటిని కనుక అమలు చేసి ఉంటే ఇప్పుడు జరిగిన నష్టం సగానికి పైగా తగ్గేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఆ కమిటీ సిఫార్సుల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సిఫార్సుల్లో పర్యావరణ పరంగా కీలకపాత్ర వహించే పశ్చిమ కనుమల పరిరక్షణ ముఖ్యమైనదని ఆయన చెప్పారు. అయితే ఉప్పుడున్న పరిస్థితుల్లో పశ్చిమకనుమల మొత్తం పరిరక్షించడం సాధ్యం కాకపోయినప్పటికీ వాటిని అభివృద్ధి చేయడం కూడా ముఖ్యమేమన్న విషయం మరువరాదన్నారు. ఇప్పుడు వాటిని పరిరక్షిస్తూనే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గాడ్గిల్ సిపార్సులు అభివృద్ధి నిరోధకంగాను, రైతు వ్యతిరేకంగానూ ఉన్నాయన్న విమర్శలను ఆయన కొట్టివేశారు. ఆయన నివేదిక అభివృద్ధికి అనుకూలంగా ఉందని, అయితే ఒక నిర్దిష్ట విధానంలో ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించిందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతాల్లో విచ్చలవిడిగా, అశాస్ర్తియంగా చేపట్టిన కట్టడాల వల్ల కూడా ప్రమాదం ఏర్పడుతోందని అన్నారు. ఊరికే గాడ్గిల్ నివేదికపై విమర్శలు చేయడం మాని అందులో సిఫార్సు చేసిన అంశాలను పరిశీలించాలని ఆయన విమర్శకులకు, రాజకీయ నేతలకు సూచించారు. ముఖ్యం గా ఈ సిఫార్సులు అమలు చేస్తే నష్టం వస్తుందని భావిస్తున్న గ్రానైట్ క్వారీ, రియల్ ఎస్టేట్, టింబర్, టూరిజం వ్యాపార వర్గాలు మాత్రమే వీటిని వ్యతిరేకిస్తున్నారని ప్రొఫెసర్ విఎస్ విజయన్ పేర్కొన్నారు. అయితే ప్రజల సంక్షేమం, జాతివిపత్తుల నివారణ కన్నా వీరి ప్రయోజనాలు ఎక్కువ కాదన్న విషయం మరువరాదని ఆయన చెప్పారు.