జాతీయ వార్తలు

జర్నలిస్టులవి సహజ మరణాలు కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన వుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో జరుగుతున్న జర్నలిస్టుల మరణాలపై ఢిల్లీలో టీయూడబ్య్లూజే ధర్నా నిర్వహించింది. మంగళవారం పార్లమెంట్ వీధిలో ‘జర్నలిస్టులను కాపాడండి’ అనే నినాదంలో తెలంగాణ నుంచి వచ్చిన జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా సంఘీభావం తెలిపారు. ఎన్‌యూజే నాయకుడు రాజ్‌బిహారీ, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, రాజకీయ విశే్లషకుడు పుల్లారావు తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణలో గత నాలుగేళ్ల కాలంలో చనిపోయినా 220 మంది జర్నలిస్టులపై ప్రచురించిన పుస్తకాన్ని ఈ నిరసన కార్యక్రమంలో ఆవిష్కరించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ జర్నలిస్టులకు నివాస, ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం కత్తిమీద సాములాంటి వృత్తి అని, దేశంలో జర్నలిస్టుల సమస్యలను కారుణ్య కోణంలో చూడొద్దని అన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ అమర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని, అందుకే 31 జిల్లాల జర్నలిస్టులు వచ్చి దేశ రాజధానిలో ధర్నా చేపట్టారని వెల్లడించారు. తెలంగాణలో చనిపోయిన జర్నలిస్టులవి అసహజ మరణాలని, శ్రమ దోపిడీ కారణంగానే మరణించారని అమర్ పేర్కొన్నారు. ఐజేయూ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వందలాది మంది జర్నలిస్టులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం జర్నలిస్టుల సమస్యలపై జోక్యం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి వినతిపత్రం సమర్పించారు.

చిత్రం..ఢిలీలో ధర్నా చేస్తున్న తెలంగాణ జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్న వామపక్ష నేతలు ఏచూరి, సురవరం, డీ.రాజా తదితరులు