జాతీయ వార్తలు

ఎన్నికలకు సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాలలో శాంతిభద్రతల పర్యవేక్షణ, ఎన్నికల విధి నిర్వహణ నిమిత్తం మూడు రాష్ట్రాలకు 25వేల మంది పారామిలటరీ, పోలీసు దళాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో పనిచేస్తున్న రాష్ట్ర పోలీస్‌లకు వీరు అదనం. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు 25 కంపెనీలు (ఒక్కో కంపెనీలో వెయ్యిమంది ఉంటారు) దళాలను పంపించాలని, అక్టోబర్ 15కల్లా వారు ఆయా రాష్ట్రాలలో పొజిషన్ తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. ఇందులో 50 కంపెనీల దళాలను మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు పంపిస్తారు. అత్యధికంగా 150 కంపెనీలను నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి పంపుతున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో మావోల ప్రాబల్యం అధికంగా ఉన్నందున ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అధిక సంఖ్యలో భద్రతా దళాలను మోహరిస్తారు. ఇంతవరకు ఆయా రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించకపోయినా ముందు జాగ్రత్త చర్యగా ఈ భద్రతా దళాలను తరలిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో నక్సల్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయడానికి ఉన్న భద్రతా దళాలకు అదనంగా ఈ మూడు రాష్ట్రాలకు వీరిని పంపిస్తున్నట్టు చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ కార్యక్రమాల నిరోధానికి ఇప్పటికే 40 బెటాలియన్ల సిఆర్‌పిఎఫ్, బిఎస్పీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు పూర్తిస్థాయిలో విధుల్లో ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు ఇతర విధుల్లో ఉన్న 250 కంపెనీల దళాలు వెంటనే వాటి నుంచి రిలీవ్ అయ్యి, ఆయా రాష్ట్రాలలో ఈనెల 15 కల్లా రిపోర్టు చేయాలని, ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత వారు ఎక్కడ పనిచేయాలో సమగ్ర చార్టును పంపిస్తామని తెలిపారు. యూపీ, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్‌ల నుంచి ఈ దళాలను ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పంపిస్తున్నట్టు చెప్పారు. ఇందులో ఎక్కువ శాతం మందిని ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నామన్నారు. అలాగే ఈ రక్షక దళాలకు అవసరమయ్యే శాటిలైట్ ఫోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, జిపిఎస్ సిస్టమ్స్, ఆర్మ్‌డ్ వాహనాలను కూడా ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని హోమంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ మూడు రాష్ట్రాలలో ఈ ఏడాది అక్టోబర్‌లో కాని, నవంబర్‌లో కాని ఎన్నికలు జరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.