జాతీయ వార్తలు

మోగింది నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ శాసన సభకు ముందస్తు ఎన్నికలు డిసెంబర్ 7న జరుగుతాయి. నోటిఫికేషన్ నవంబర్ 12న జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ నవంబర్ 19. మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 22. హైకోర్టు కేసు మూలంగా తెలంగాణ ఓటర్ల జాబితాను ఈ నెల 8కి బదులు 12న ప్రకటిస్తారు. చత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 12న, రెండో దశ పోలింగ్ నవంబర్ 20న, మధ్యప్రదేశ్, మిజోరం శాసనసభల పోలింగ్ నవంబర్ 28న జరుగుతాయి. ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశించిన విధంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మధ్యప్రదేశ్, తదితర నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు జరుగుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ శనివారం విలేఖరుల సమావేశంలో ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఓటర్ల జాబితా వ్యవహారం రాష్ట్ర హైకోర్టులో ఉన్నందున తెలంగాణ ఎన్నికల వ్యవహారం కొంత జఠిలమైందని, ఎన్నికల షెడ్యూలును ఇప్పుడే ప్రకటించలేమనే అభిప్రాయాన్ని కలిగించిన రావత్ ఆఖరుకి రాజస్థాన్‌తోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూలు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ, రాజస్థాన్ శాసనసభల ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 12న జారీ చేస్తారు. పోలింగ్ డిసెంబర్ 7వ తేదీన జరుగుతుంది. తెలంగాణ, రాజస్థాన్ శాసనసభలకు నామినేషన్లను దాఖలు చేయటం నవంబర్ 12 నుండి ప్రారంభం అవుతుంది. నామినేషన్లను నవంబర్ 19లోగా దాఖలు చేయవలసి
ఉంటుంది. నామినేషన్లను నవంబర్ 20న పరిశీలిస్తారు. 22లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవలసి ఉంటుంది. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయి. చత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ 16న జారీ చేస్తారు. మొదటి దశ కింద 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 23 అక్టోబర్, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24, అక్టోబర్ 26వ తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకోవలసి ఉంటుంది. పోలింగ్ నవంబర్ 12న జరుగుతుంది. చత్తీస్‌గఢ్ రెండోదశ కింద 72 అసెంబ్లీ నియోజవర్గాలకు ఎన్నికలు జరిపేందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అక్టోబర్ 26న జారీ చేస్తారు. నేమిషన్లను నవంబర్ 2లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. నామినేషన్లను నవంబర్ 3న పరిశీలిస్తారు. 5లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవలసి ఉంటుంది. పోలింగ్ నవంబర్ 20న జరుగుతుంది. మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ రెండో తేదీన జారీ అవుతుంది. నామినేషన్లను నవంబర్ 9లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన నవంబర్ 12న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 14తో ముగుస్తుంది. పోలింగ్ నవంబర్ 28న జరుగుతుంది. తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇదివరకే అమలులోకి వచ్చినందున మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటినుంచి అమలులోకి వస్తుందని రావత్ ప్రకటించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల షెడ్యూలు ప్రకటన వ్యవహారం అత్యంత ఉత్కంఠతో కొనసాగింది. ముందు నిర్ణయించిన ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం పనె్నండున్నర గంటలకు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఆ తరువాత కొద్ది సేపటికే సమావేశం సమయాన్ని సాయంత్రం మూడు గంటలకు మార్చారు. సాయంత్రం విలేకరుల సమావేశం ప్రారంభం కాగానే ఎన్నికల సంఘం ప్రధానాధికారి రావత్ మాట్లాడుతూ తెలంగాణ ఓటర్ల జాబితాకు సంబంధించిన కేసు మూలంగా విలేఖరుల సమావేశాన్ని వాయిదా వేసుకోవలసి వచ్చిందన్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రకటనలో సమస్యలు తలెత్తాయి. నిపుణులతో ఈ సమస్యను పరిష్కరింపజేసి జాబితాలను ఈ నెల 8న ప్రకటించాలనుకున్నాం. అయితే సమస్య పరిష్కారానికి మరికొంత సమయం కావాలని నిపుణులు సూచించటంతోపాటు జాబితాను ఈ నెల 12న ప్రకటించాలని నిర్ణయించామని రావత్ చెప్పారు. దీనితోపాటు తెలంగాణ ఓటర్ల జాబితా వ్యవహారం హైకోర్టులో ఉన్నందున ఏమీ చేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. రద్దయిన తెలంగాణ శాసనసభకు వీలున్నంత త్వరగా ఎన్నికలు జరుపవలసిన అవసరం ఉన్నది.. అయితే చట్ట ప్రకారం ఆరునెలల్లోగా ఎన్నికలు జరుపుకోవచ్చునని రావత్ వివరించారు. దీనితో తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూలును శనివారం ప్రకటించకపోవచ్చునని అందరూ భావించారు. అయితే రావత్ ఆ తరువాత వరుసగా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం శాసనసభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించి, ఆఖరున రాజస్థాన్ శాసనసభ ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తూ దానితోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యపోయారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రకటన ఆలస్యమవుతున్నందున పోలింగ్‌ను కూడా ఆఖరున రాజస్థాన్‌తోపాటు కలిపి పెట్టామని రావత్ వివరణ ఇచ్చారు.
తెలంగాణ ఓటర్ల జాబితాకు సంబంధించిన కేసు రాష్ట్ర హైకోర్టులో ఉన్నది, దీనికితోడు మీరు కూడా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించలేదు, ఇవి ఇలా ఉండగా మీరు తెలంగాణ ఎన్నికల షెడ్యూలును ఎలా ప్రకటించారని ఒక విలేఖరి ప్రశ్నించగా తెలంగాణ ఓటర్ల జాబితాను తమకు చూపించిన తరువాతనే ప్రచురించాలని మాత్రమే ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు సోమవారం ఓటర్ల జాబితాను కోర్టుకు చూపించి ఆ తరువాత పనె్నండో తేదీ ప్రకటిస్తామని రావత్ బదులిచ్చారు. తెలంగాణలో తాను పర్యటించకపోవటం నిజమే.. అయితే ఇతర సీనియర్ అధికారులు పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి వచ్చారని ఆయన వివరణ ఇచ్చారు. మిజోరంలో కూడా తాను పర్యటించలేదు.. ఇతర సీనియర్ అధికారులు పర్యటించి వచ్చిన తరువాత ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూలు విడుదల చేశామని ఆయన చెప్పారు. తెలంగాణ ఓటర్ల జాబితాలో దాదాపు 70 లక్షల మంది ఓటర్ల వ్యవహారం అనుమానాస్పదంగా ఉన్నదనే ఫిర్యాదులు వచ్చాయి.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమస్యను పరిష్కరించిందా? అని మరో విలేఖరి ప్రశ్నించగా రావత్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. కర్నాటకలో ఖాళీ అయిన లోక్‌సభ సీట్లకు మీరిప్పుడు ఉపఎన్నికలు ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న లోక్‌సభ సీట్లకు ఉపఎన్నికలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించగా, కర్నాటక ఎంపీలు రాజీనామా చేసే సమయానికి లోక్‌సభకు ఇంకా ఒక సంవత్సరం గడువు ఉన్నందున ఉపఎన్నికలు పెడుతున్నాం.. ఏపీ ఎంపీలు రాజీనామా చేసే సమయానికి లోక్‌సభ గడువు ఒక సంవత్సరం కంటే తక్కువగా ఉన్నందున ఉప ఎన్నికలు పెట్టటం లేదని వివరణ ఇచ్చారు.
*
తెలంగాణ, రాజస్థాన్
నోటిఫికేషన్ నవంబర్ 12
నామినేషన్ల గడువు నవంబర్ 19
నామినేషన్ల పరిశీలన నవంబర్ 20
ఉపసంహరణ గడువు నవంబర్ 22
పోలింగ్ డిసెంబర్ 7
ఫలితాలు డిసెంబర్ 11
*
మధ్యప్రదేశ్, మిజోరం
నోటిఫికేషన్ నవంబర్ 2
నామినేషన్ల గడువు నవంబర్ 9
నామినేషన్ల పరిశీలన నవంబర్ 12
ఉపసంహరణ గడువు నవంబర్ 14
పోలింగ్ నవంబర్ 28
ఫలితాలు డిసెంబర్ 11
*
చత్తీస్‌గఢ్

మొదటి దశ :
నోటిఫికేషన్ అక్టోబర్ 16
నామినేషన్ల గడువు అక్టోబర్ 23
నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24
ఉపసంహరణ గడువు అక్టోబర్ 26
పోలింగ్ నవంబర్ 12
రెండో దశ :
నోటిఫికేషన్ అక్టోబర్ 26
నామినేషన్ల గడువు నవంబర్ 2
నామినేషన్ల పరిశీలన నవంబర్ 3
ఉపసంహరణ గడువు నవంబర్ 5
పోలింగ్ నవంబర్ 20
ఫలితాలు డిసెంబర్ 11
*
చిత్రం..ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్