జాతీయ వార్తలు

మూడేళ్లలో నక్సలిజాన్ని తరిమేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 7: వచ్చే మూడేళ్లలో దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని సంపూర్ణంగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆదివారం ఇక్కడ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) 26వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఆర్‌ఏఎఫ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. మీ వీరోచిత పోరాటం, త్యాగనిరతి ద్వారా దేశానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. దేశంలో భద్రతా బలగాలు నిరంతరం గాలింపు చర్యలు చేపట్టడం ద్వారా నక్సల్స్ హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయన్నారు. మూడేళ్ల క్రితం వరకు రోజూ ఎక్కడో ఒక చోట మావోయిస్టు పార్టీ హింసాత్మక ఘటనలకు పాల్పడేదన్నారు. ఈ రోజు ప్రజల భాగస్వామ్యం, భద్రతా బలగాల అప్రమత్తత వల్ల హింస గణనీయంగా తగ్గిందన్నారు. అహర్నిశలు అడవుల్లో విధులను నిర్వహిస్తూ సాహసోపేతంగా పనిచేస్తున్నారని ఆయన కితాబునిచ్చారు. సమాజానికి వామపక్ష తీవ్రవాదం నుంచి ముప్పును తగ్గించేందుకు అంకితభావంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు చురుకుగా పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఇంతవరకు భద్రతా బలగాల గాలింపు చర్యల్లో 131 మంది మావోయిస్టులు హతమయ్యారన్నారు. దాదాపు 1278 మంది నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. 58 మంది నక్సలైట్లు లొంగిపోయారన్నారు. జమ్ముకాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల నిర్మూలనకు తెగించిపోరాడుతున్నారన్నారు. కాశ్మీర్‌లో కొంత మంది యువకులు పెడత్రోవ పట్టి ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. దేశంలో అక్రమంగా చొరబడి విధ్వంసం సృష్టించే శక్తుల ఆట కట్టించాలన్నారు. సమాజంలో అశాంతి నెలకొని ఉన్నప్పుడు ఆగ్రహంతో ఉన్న ప్రజాసమూహాలను చాకచక్యంగా నియంత్రించాలన్నారు. ఏ మేరకు అవసరమో అంతవరకే బలప్రయోగం చేయాలన్నారు. ఆర్‌ఏఎఫ్ బెటాలియన్‌లో వెయ్యి మంది సిబ్బంది ఉంటారని, వీరికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ, పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. నిరసనలు, అల్లర్లు చెలరేగినప్పుడు నియంత్రించేందుకు ఆధునిక పరికరాలు వచ్చాయన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక భాగమన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో దేశ వ్యాప్తంగా మూడు లక్షల మంది జవాన్లు ఉన్నారన్నారు. తీవ్రవాదులు, ఉగ్రవాదులు కదలికలపై నిఘా సమాచారాన్ని సేకరించే వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. హింస వల్ల సాధించేదేమీ ఉండదని ఆయన చెప్పారు. సమాజ ప్రగతికి శాంతి భద్రతలు అవసరమన్నారు. నిరాశా నిస్పృహలకు లోనైన యువత తీవ్రవాదం పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. హైదరాబాద్, అహమ్మదాబాద్, అలహాబాద్, ముంబయి, ఢిల్లీ, అలీఘడ్, కోయంబత్తూర్, జెంషెడ్‌పూర్, భోపాల్, మీరట్‌లో ఆర్‌ఏఎఫ్ బెటాలియన్లు ఉన్నాయన్నారు. జైపూర్, వారణాసి, మంగళూరు, హాజీపూర్, నూహ్ (హర్యానా)లో ఆర్‌ఏఎఫ్ బేస్‌లు ఉన్నాయని ఆయన చెప్పారు.

చిత్రం..రాఫ్ దళాల అభివాదం స్వీకరిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్