జాతీయ వార్తలు

ఎన్డీయేను ఓడిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేయాలని సీపీఎం నాయకత్వం పిలుపునిచ్చింది. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకూడదని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బీఎల్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయాలని సీపీఎం సెంట్రల్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీని ఓడించేందుకు కృషి చేయాలని కమిటీ తీర్మానించింది. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)ను ఏర్పాటు చేయటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించారు. సీపీఎం సెంట్రల్ కమిటీ ఈనెల 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమావేశమై దేశంలోని వివిధ సమస్యలు, రాజకీయ పరిస్థితి, లోక్‌సభ, శాసన సభల ఎన్నికల గురించి సుదీర్ఘ చర్చలు జరిపింది. సీపీఎం సెంట్రల్ కమిటీ మూడు రోజుల సమావేశానంతరం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని
ఓడించేందుకు పని చేయటం, లోక్‌సభలో వామపక్షాలు ముఖ్యంగా సీపీఎం ప్రాతినిధ్యాన్ని పెంచుకోవటం, కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలన్నది సెంట్రల్ కమిటీ నిర్ణయాలని సీతారం ఏచూరి తెలిపారు. నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా పెట్రోలియం వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరుగుదల, వ్యవసాయ రంగంలో సంక్షోభం మరిత తీవ్రం కావటం మూలంగా దేశంలో ప్రజల జీవన స్థితిగతులు దుర్భరంగా తయారయ్యాయని కమిటీ ఆరోపించింది. కులతత్వం పెరిగిపోవటం మూలంగా విద్వేష వాతావరణం బాగా విస్తరిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశాన్ని అమెరికా జూనియర్ భాగస్వామిగా తయారు చేస్తున్నారంటూ ఆయన మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఏచూరి ప్రకటించారు. ఈ మూడు రాష్ట్రాల శాసన సభల్లో తమ పార్టీ ప్రతినిధుల సంఖ్యను పెంచుకోవటమే తమ లక్ష్యమని ఏచూరి చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని నియోజకవర్గాల్లో మిత్రిపక్షాల అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని ఆయన ప్రకటించారు. మహా కూటమి ఏర్పాటులో పలు సమస్యలున్నాయంటూ రాష్ట్రాల వారీగా స్థానిక పరిస్థితుల ఆధారంగా పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు.
తెలంగాణలో మెజారిటీ సీట్లలో పోటీ
తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీని ఓడించేందుకు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నట్లు సీతారాం ఏచూరి ప్రకటించారు. టీఆర్‌ఎస్, బీజేపీని ఓడించేందుకు బీఎల్‌ఎఫ్ మెజారిటీ సీట్లలో పోటీ చేస్తుందని సీతారాం ఏచూరి ప్రకటించారు. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. తమ పార్టీ ఇంత వరకు 12 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది, త్వరలోనే మరో జాబితాను విడుదల చేస్తామని ఏచూరి చెప్పారు. రాఫెల్ కుంభకోణం గురించి దేశ ప్రజలందరికీ వివరిస్తామని ఆయన తెలిపారు. వివిధ ప్రైవేట్ సంస్థలు బ్యాంకులకు ఎగవేసిన రుణాల వివరాలను కూడా ప్రజలకు వివరిస్తామన్నారు.