జాతీయ వార్తలు

వైభవాల వరంగల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: నాటి కాకతీయుల రాజధాని వరంగల్లు దేశంలోనే అత్యుత్తమ వారసత్వ నగరంగా ఎంపికైంది. కేంద్ర పర్యాటక శాఖ ప్రతి ఏటా ఇచ్చే అవార్డులలో వారసత్వ నగరం విభాగంలో వరంగల్లుకు పురస్కారం దక్కింది. దాదాపు పదకొండు వందల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న అపూర్వ కాకతీయ వారసత్వ సంపద అయిన శిల్పకళ, నాట్యకళ, నిర్మాణకళ ఇవాల్టికీ చెక్కుచెదరకుండా నిలబడటం వల్లనే ఈ జాతీయ గుర్తింపు లభించింది.
దీంతోపాటు కాకతీయుల ప్రజాపాలనకు వ్యవసాయానికి ఆలంబనగా ఇవాల్టికీ ఉన్న చెరువులు, వృక్షసంపద కూడా నగరానికి జాతీయ వారసత్వ ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. 2014-15 సంవత్సరానికి కేంద్రం పర్యాటక అవార్డులను శనివారం ప్రదానం చేసింది. దేశంలో అత్యుత్తమ పర్యాటక రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. రాజస్థాన్‌లోని సవాయ్ మధోపూర్ రైల్వేస్టేషన్ పర్యాటక మిత్ర రైల్వే స్టేషన్‌గా, ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయంగా పురస్కారాలను పొందాయి. గోవాలోని తాజ్ ఎగ్జోటికా, సాల్కెట్ హోటల్‌లకు ఉత్తమ హోటల్‌లుగా అవార్డులు లభించాయి. ఉదయ్‌పూర్‌లోని ఫతే ప్రకాశ్ పాలెస్, కొట్టాయం దగ్గరి కుమారకోం లోని కొబ్బరి మడుగుకు వివిధ కేటగిరీలలో పురస్కారాలు లభించాయి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ ఈ పురస్కారాలను అందించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీనా జెడ్ చొంగ్తు, వరంగల్ వారసత్వ నగరపు అవార్డును స్వీకరించారు. 2025నాటికి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పర్యాటకులను ఆదర్శించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మహేశ్ శర్మ తెలిపారు. పర్యాటక రంగం ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 14.1 శాతం ఆదాయం పెరిగిందని, 73,065 కోట్ల రూపాయలను ఆర్జించినట్లు మంత్రి వెల్లడించారు.

చిత్రం.. అవార్డు అందుకుంటున్న పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీనా జెడ్ చొంగ్తు