జాతీయ వార్తలు

కూటమికి ఓటమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసినట్లే 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మహాకూటమికి ఓటమి తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నాలుగున్నర సంవత్సరాలుగా దేశాన్ని నిజాయితీ, చిత్తశుద్ధితో పరిపాలించాను.. ఇస్లామిక్ ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని ఉరి సైనిక క్షేత్రంలో మన సైనికులపై చేసిన దాడికి ప్రతీకారంగానే మెరుపు దాడి జరిగింది.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి ఎంతమాత్రం లేదు.. మన సైనిక దళాలను పరిపుష్టం చేసేందుకు ఎన్ని ఆరోపణలు వచ్చినా సహిస్తాను.. జీఎస్‌టీ సమష్టి నిర్ణయం.. పెద్దనోట్ల రద్దు తొందరపాటు చర్యకాదు.. రైతులను ఆదుకునేందుకు ఆలోచనతో కూడిన కార్యక్రమాన్ని అమలు చేస్తాం.. సుప్రీం కోర్టు నిర్ణయం ఆధారంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది’ అని నరేంద్ర మోదీ తెలిపారు. నరేంద్ర మోదీ ఏఎన్‌ఐకి 90 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యులో పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణ ప్రజలు మహాకూటమిని చావుదెబ్బ తీశారు, లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశ ప్రజలు మహాకూటమిని ఓడిస్తారని ఆయన తెలిపారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలిసి జాతీయస్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు నరేంద్ర మోదీ సమాధానమిస్తూ- తెలంగాణ ప్రజలు మహాకూటమిని చావుదెబ్బ తీశారు, దీని గురించి జాతీయస్థాయిలో ఎందుకు చర్చ జరగటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఓడించినట్లే లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మహాకూటమిని ఓడిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీ ఆశీస్సులతోనే ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్న ప్రశ్నకు బదులిస్తూ- చంద్రశేఖరరావు
ఏం చేస్తున్నాడనేది తనకు ఎలా తెలుస్తుందని మోదీ ఎదురు ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసేందుకు చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నం గురించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని ఆయన దాటవేశారు. లోక్‌సభ ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీకి మధ్య జరుగుతాయనే అభిప్రాయంతో ఆయన ఏకీభవించలేదు. లోకసభ ఎన్నికలు ప్రజలు, మహాకూటమి మధ్య పోటీ అని ఆయన అన్నారు.
రైతుల రుణమాఫీ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ- రుణమాఫీ కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని, రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక, పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రుణమాఫీకి అర్హులైన నిజమైన రైతులు బ్యాంకింగ్ వ్యవస్థలో లేరు.. చిన్న రైతులంతా వడ్డీ వ్యాపారుల వద్దే రుణాలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. మాజీ ఉపప్రధాన మంత్రి దేవీలాల్ నుండి ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు అనేకసార్లు రుణ మాఫీలు జరిగినా రైతుల పరిస్థితి బాగుపడలేదు.. ఎందుకిలా జరుగుతోందో ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని నరేంద్ర మోదీ సూచించారు. విత్తనాల పంపిణీ నుండి పండించిన ఆహార దాన్యాలను మార్కెట్‌కు పంపించే వరకు సంస్కరణలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమాన్ని రాజకీయం చేయటం మంచిది కాదని ఆయన చెప్పారు.
పెద్దనోట్ల రద్దు ఫలితాలు భవిష్యత్తులో కలుగుతాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఇది తొందరపాటు నిర్ణయం ఎంతమాత్రం కాదు.. తమవద్ద ఉన్న నల్లధనాన్ని ఇచ్చి వేయాలని మొదట సూచించాం.. దీనికోసం మార్గాలను ముందు పెట్టాం.. దాదాపు ఒక ఏడాదిపాటు ఇదంతా చేసిన తరువాతే కఠిన చర్య కింద పెద్దనోట్లను రద్దు చేశామని ఆయన వివరించారు. అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతోనే జీఎస్‌టీని అమలు చేస్తున్నాం.. కేవలం ఎన్‌డీఏ ప్రభుత్వం మాత్రమే జీఎస్‌టీకి బాధ్యత వహించాలనడం సమంజసం కాదని అన్నారు. జీఎస్‌టీ వలన ప్రజలపై పన్నుల భారం తగ్గింది.. రహస్య పన్నులు నిలిచిపోయాయని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజలపై జీఎస్‌టీ భారం పడకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు వాటిని సవరిస్తూనే ఉన్నామని అన్నారు. దేశంలోని మధ్య తరగతి ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు తమ ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. మూకదాడులు ఎక్కడ జరిగినా ఖండించవలసిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌డీఏ అధికారంలోకి రాకముందు కూడా మూకదాడులు జరిగాయని ఆయన అన్నారు.
సుప్రీం కోర్టులో కొనసాగుతున్న న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన తరువాతనే అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ఒక నిర్ణయం తీసుకుంటామని నరేంద్ర మోదీ తెలిపారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేందుకు అర్టినెన్స్ జారీ చేసినట్లే.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ జారీ చేస్తారా అన్న ప్రశ్నకు- సుప్రీం కోర్టులో రామమందిర నిర్మాణం కేసుకు అడ్డుతగలకుండా తమ న్యాయవాదులకు సూచనలు జారీచేయాలని ఆయన కాంగ్రెస్ అధినాయకత్వానికి సూచించారు. అయోధ్య కేసు త్వరితగతిన పూర్తికాకుండా చూసేందుకు కాంగ్రెస్ ప్రోత్సాహిత న్యాయవాదులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయోధ్య వివాదానికి రాజ్యాంగ పరిధిలో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బెయిల్‌పై ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం తనపై ఆరోపణలు చేయటం ఏమిటని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. దేశాన్ని నాలుగు తరాలపాటు పాలించిన కాంగ్రెస్ పలు కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. ఆర్‌బీఐ, సీబీఐ వంటి సంస్థలను తాను నిర్వీర్యం చేస్తున్నట్లు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యక్తిగత కారుణాలతోనే తన పదవికి రాజీనామా చేశారని.. ఈ విషయాన్ని ఆయన తనకు ఏడు నెలల ముందే చెప్పారని అన్నారు. ఉర్జిత్ పటేల్ పని తీరును నరేంద్ర మోదీ ప్రశంసించారు.
బెనారస్.. పూరీ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కూడా ఆయన ఇవ్వలేదు. మీరు ఈసారి వారణాసితోపాటు ఒడిశాలోని పూరి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే మాట వినిపిస్తోందని.. ఇందులో ఏది నిజమని అడగ్గా- చిరునవ్వే ఆయన సమాధానమైంది. ‘నది వద్దకు వచ్చినప్పుడు ఎలా దాటాలనేది నిర్ణయిస్తాం’ అని చెప్పారే తప్ప స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.