జాతీయ వార్తలు

శబరిమల మళ్లీ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 3: శబరిమల ఆలయంలో 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న ఇద్దరు మహిళలు దర్శనం చేసుకోవడం వివాదానికి దారితీసింది. ఈ అంశంపై రాష్ట్రప్రభుత్వ వైఖరికి నిరసనగా కేరళలో హిందూసంఘాలు, బీజేపీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపుహింసాత్మకంగా మారింది. వివిధ నగరాలు, పట్టణాల్లో ఆందోళనాకారులు రోడ్లపైకి వచ్చి టైర్లను తగలబెట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్ర, జాతీయ రహదారులపై బీజేపీ, హిందూసంఘాల కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఒక హిందూ సంఘం కార్యకర్త మరణించగా, ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. త్రిశూర్‌లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక మత సంస్థ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతోవారిని ఆసుపత్రికి తరలించారు. పండలంలో సీపీఎం కార్యకర్తల దాడిలో మృతి చెందిన వ్యక్తికి 55 ఏళ్లని, బుధవారం రాత్రి మరణించినట్లు పోలీసులు చెప్పారు.
వివిధ హిందూసంఘాలు కలిపి శబరిమల కర్మ సమితి ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చాయి. చాలా చోట్ల సీపీఎం కార్యకర్తలకు చెందిన దుకాణాలపై దాడులు చేశారు. షాపులను ధ్వంసం చేశారు. దీంతో పలు చోట్ల పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు గుంపులుగుంపులుగా చేరి ట్రాఫిక్‌ను అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీ చార్జీ చేశారు. కొన్ని చోట్ల సీపీఎం, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ముఖ్యమంత్రి పి విజయన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఘర్షణలు, బంద్ వెనక ఆరెస్సెస్ కుట్ర ఉందన్నారు. శబరిమల కర్మ సమితికి చెందిన చంద్రన్ ఉన్నితన్ గుండెపోటుతో మరణించాడని, సీపీఎం కార్యకర్తల దాడిలో మరణించినట్లు ప్రచారం చేయడం తగదన్నారు. పండలంలో ఈ వ్యక్తి మరణించిన సంగతి విదితమే. కేరళలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మతతత్వశక్తుల ఆగడాలను కొనసాగనివ్వమన్నారు. మతం, మతవిశ్వాసాలకు తాము వ్యతిరేకులం కాదని, కోర్టు తీర్పును అమలు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 71 బస్సులను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని, 31 మంది పోలీసులు రాళ్లు రువ్విన ఘటనలో గాయపడ్డారని చెప్పారు. కోజికోడ్, కన్నూర్, మల్లాపురం, పాలక్కాడ్, తిరువనంతపురంలో ఉద్రిక్తత పరిస్థితులను ఆందోళన కారులు సృష్టించారని, పోలీసులు గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారన్నారు. నెడుమంగడు పోలీసు స్టేషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబును విసిరారు. కాని అది పేలలేదన్నారు. ఇద్దరు మహిళలు ప్రవేశించిన తర్వాత శబరిమల ఆలయాన్ని మూసి సంప్రోక్షణ చేయడమంటే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో కేరళకు చెందిన కొంత మంది న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కాని వెంటనే ఈ కేసును విచారించేందుకు కోర్టు నిరాకరించింది. రివ్యూ పిటిషన్‌తో పాటే కోర్టు ధిక్కారం పిటిషన్‌ను విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ చెప్పారు. యంగ్ లాయర్స్ అసోసియేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది.

చిత్రాలు.. శబరిమల ఆలయాన్ని అపవిత్రం చేశారంటూ కేరళ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆందోళనలు మిన్నంటాయి. పలక్కాడ్‌లో పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు. బెంగళూరులో ఆందోళన చేస్తున్న అయ్యప్ప భక్తులు (కింది చిత్రం)